logo

విమాన టిక్కెట్ల రద్దు.. ప్రయాణికుడికి అసౌకర్యం

ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ (ఇండిగో ఎయిర్‌లైన్స్‌)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్‌ మొట్టికాయలు వేసింది.

Published : 02 Jul 2024 07:04 IST

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌కు మొట్టికాయలు
రూ.5లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన రంగారెడ్డి జిల్లా కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికురాలి ప్రమేయం లేకుండా టిక్కెట్లు రద్దుచేసి అసౌకర్యాన్ని కలిగించిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ (ఇండిగో ఎయిర్‌లైన్స్‌)కు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్‌ మొట్టికాయలు వేసింది. ఫిర్యాదీకి రూ.5లక్షల పరిహారం, రూ.10వేల కేసుఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. కావూరిహిల్స్‌కు చెందిన ఎ.నాగ అంజని మౌనిక ఐదుగురు కుటుంబసభ్యులతో కలిసి పోర్ట్‌బ్లెయిర్‌ విహారయాత్రకని యాత్రా.కామ్‌ ద్వారా రూ.92,210 చెల్లించి టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. 2020 డిసెంబరు 24నుంచి 29 తేదీలకు ప్రణాళికలు వేసుకొని డిసెంబరు 4న టిక్కెట్లు బుక్‌ చేశారు. తీరా.. ప్రయాణం చేయాల్సిన రోజున టిక్కెట్లు రద్దయ్యాయని సమాచారం రావడంతో అవాక్కయిన ఫిర్యాదీ ప్రతివాద సంస్థసిబ్బందిని సంప్రదించారు. సరైన సమాధానం రాకపోవడం, అప్పటికే హోటల్‌ ఇతరాలకు ముందస్తుగా డబ్బులు చెల్లించడంతో చేసేదేమీ లేక వన్‌వే ట్రిప్‌ కోసం రూ.71,645 చెల్లించగా రద్దయిన పీఎన్‌ఆర్‌ నంబర్‌తోనే టిక్కెట్లు బుక్‌చేశారు. తిరుగు ప్రయాణం కోసం మరో రూ.35,925 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రతివాద సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో రూ.1,07,925 అదనంగా ఖర్చయిందని ఫిర్యాదీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదీకి అసౌకర్యం కల్పించడమే కాకుండా ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని రంగారెడ్డి జిల్లా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిహారం కేసుఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని