logo

వివాహేతర సంబంధానికి ఒత్తిడి తెచ్చాడని అంతమొందించారు

వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్‌ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు.

Published : 02 Jul 2024 02:07 IST

దుబాయ్‌ ఇంజినీరు హత్య కేసులో ఇద్దరి రిమాండ్‌

నార్సింగి, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం కోసం గృహిణిపై ఒత్తిడి తీసుకురావడంతోనే దుబాయ్‌ ఇంజినీరు హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ చోటాబజార్‌కు చెందిన సయ్యద్‌ హిదాయత్‌ అలీ(31) సౌదీలో ఇంజినీరుగా పనిచేసేవాడు. 20 రోజుల క్రితం భారత్‌కు వచ్చిన ఆయన తన ఇంటికి ఎదురుగా నివాసం ఉంటున్న సీమాబేగం అలియాస్‌ సీమాపై మనసుపడ్డాడు. ఆమెకు వివాహం జరగడంతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. తనతో సంబంధం పెట్టుకోవాలని హిదాయత్‌ కోరడంతో ఆమె నిరాకరించింది. అయినా వినకుండా వెంటపడడంతో విషయాన్ని తన ప్రియుడైన ఫలక్‌నూమా తీగలకుంటకు చెందిన ఫ్యాబ్రికేషన్‌ పనిచేసే సయ్యద్‌ అమీర్‌(ఇతడికి కూడా వివాహమై ముగ్గురు సంతానం)కు చెప్పింది. దీంతో హిదాయత్‌అలీని బయటికి తీసుకొస్తే చంపేద్దామని ఇద్దరూ కలిసి పథకం పన్నారు. ఆ మేరకు హిదాయత్‌ అలీ వాహనంలోనే అతడితో పాటు సీమాబేగం ఈ నెల 29న ఉదయం 11.30 గంటలకు మంచిరేవులకు బయల్దేరగా వారిని ద్విచక్రవాహనంపై సయ్యద్‌ అమీర్‌ అనుసరించాడు. గ్రీన్‌లాండ్స్‌ కాలనీ వద్దకు చేరుకున్న వారు అక్కడ ఆగి మాట్లాడుతూ గొడవపడ్డారు. దీన్ని గమనించిన సయ్యద్‌ అమీర్‌ అక్కడకు చేరుకుని హిదాయత్‌అలీని పక్కనే ఉన్న ప్రహరీ నిర్మించిన ఖాళీ ప్లాటులోకి లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్యచేశాడు. అనంతరం సీమాబేగంతో కలిసి అమీర్‌ ద్విచక్ర వాహనంపై పారిపోయారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితులు షాహీన్‌నగర్‌లోఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని