logo

పుట్టిన రోజునే వృద్ధురాలి అంత్యక్రియలు

తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు  ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది.

Published : 02 Jul 2024 02:06 IST

మధుబాయి

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: తల్లి పుట్టిన రోజు జరపాల్సిన రోజు  ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కుమారుల వద్దకు వెళ్లేందుకు రైలెక్కిన తల్లి కొద్దిసేపటికే మృతి చెందింది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... నెల్లూరులో ఉంటున్న మధుబాయి(65), రమేష్‌మాల్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భర్త చనిపోవడంతో ఆమె నెల్లూరులో కుమారుల వద్ద ఉంటోంది. పెద్దకుమార్తె మియాపూర్‌లో ఉంటోంది. వారి వద్దకు ఆమె గత నెల 2న వచ్చింది. తిరిగి కుమారుల వద్దకు వెళ్లేందుకు గత నెల 30న రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు కుమార్తెతో కలిసి వచ్చింది. సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలు 10వ నంబరు ప్లాట్‌ఫాంపై ఉంది. అక్కడికి వెళ్లే సరికి ఆమె తీవ్ర ఆయాసానికి గురైంది.  రైలు ఎక్కిన కాసేపటికే కుమార్తె తల్లికి ఫోన్‌ చేయగా ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ వాంతి చేసుకుని పడిపోయిందని చెప్పింది. అప్పటికి రైలు కదల్లేదు. వెంటనే ప్రయాణికుల సహాయంతో ప్లాట్‌ఫాంపై తల్లిని దింపి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  మధుబాయి పుట్టినరోజు జులై 1న అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం విషాదానికి గురి చేసిందని కుమారులు, కుమార్తెలు వాపోయారు.


యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం

వంశీకృష్ణ

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’(తుదిశ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సునీత బర్ల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన ఇంద్రకంటి వంశీకృష్ణ అలియాస్‌ బబ్లూ(19) హయత్‌నగర్‌ శాంతినగర్‌లో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ ఇంటర్‌ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 డిసెంబరు 10న బంధువుల ఇంటికెళ్లి ఆటోలో తిరిగొస్తున్న యువతిని మధ్యలో ఆపి.. ఇంటి వద్ద దింపుతానని బైక్‌పై ఎక్కించుకొని.. తన ఇంటికి తీసుకెళ్లి రెండ్రోజులు నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. బాధితురాలికి సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. దర్యాప్తు తర్వాత నిందితుడిపై భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేశారు.


ఈఎంఐ చెల్లించేందుకు గొలుసు చోరీలు

నిజాంపేట, న్యూస్‌టుడే: నిందితుడు 2012 నుంచి 2015 వరకు పలు ఠాణాల్లో 36 దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. రెండేళ్ల తర్వాత విడుదలై రాజస్థాన్‌ వెళ్లి స్థిరపడ్డాడు. బతుకుదెరువు కోసం ఇటీవల విశాఖపట్నానికి మకాం మార్చాడు. అయితే బ్యాంకులో తీసుకున్న రుణం తాలూకు ఈఎంఐ చెల్లించే స్తోమత లేకపోవడంతో తిరిగి పాతబాట పట్టాడు. నిందితుడిని బాచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.  బాలానగర్‌ డీసీపీ కె.సురేష్‌కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. మహేందర్‌సింగ్‌(42) గతనెల 24న ప్రగతినగర్‌ ఇన్‌కాయిస్‌ రోడ్డులో కోటేశ్వరమ్మ అనే మహిళ మెడలోంచి 3 తులాల బంగారు గొలసును బైక్‌పై వచ్చి లాక్కొని పరారయ్యాడు. మరుసటి రోజు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న యువతి మెడలోంచి గొలసు లాక్కునే ప్రయత్నం చేశాడు. బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుంది. 20 నిమిషాల వ్యవధిలోనే మరో మహిళ మెడలోంచి 3 తులాల గొలుసును లాక్కున్నాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయా ఘటనా స్థలాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించిన నిందితుడు ఒక్కడే అని గుర్తించారు. బాచుపల్లి మమతా ఆసుపత్రి వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అదే సమయంలో అటుగా వస్తున్న మహేందర్‌సింగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.5లక్షల విలువైన 6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్‌ పాల్గొన్నారు.


హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు

ముజాహిద్‌ , జిలానీ పాషా , ఫిరోజ్‌ఖాన్‌

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కలిసి వేసిన వెంచర్‌లోని ప్లాట్లన్నీ ఒక్కడే అమ్ముకోవడమే కాకుండా వాటా అడిగినందుకు తోటి రౌడీషీటర్‌ను హత్యచేసిన కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు కూకట్‌పల్లి 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సి.పావని జీవితఖైదు విధించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యెలగపురి నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. దొమ్మరపోచంపల్లి గాయత్రీనగర్‌కు చెందిన రియల్‌ వ్యాపారి, రౌడీషీటర్‌ ముజాహిద్‌ అలియాస్‌ ముజ్జు(50), నవాబ్‌కుంటకు చెందిన రౌడీషీటర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌(40) పలు హత్య కేసుల్లో 2020కి ముందు జైలులో ఉన్నారు. అక్కడ స్నేహితులైన వీరిద్దరు బెయిల్‌పై వచ్చి ఫయాజ్‌ అనే వ్యక్తితో కలిసి 2021లో జహీరాబాద్‌లో కొంత భూమి కొనుగోలు చేసి వెంచర్‌ చేశారు. పెట్టుబడి కోసం నవాబ్‌కుంటలోని తన 500గజాల స్థలాన్ని ఇస్మాయిల్‌ అప్పట్లోనే ముజాహిద్‌ పేరుతో రిజిష్టర్‌ చేశాడు. బెయిల్‌ గడువు ముగియడంతో ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టుచేసి కోర్టుకు పంపారు. ఈ క్రమంలో ముజాహిద్‌ వెంచర్‌లో ప్లాట్లన్నీ అమ్మి సొమ్ము చేసుకున్నాడు. 2022లో జైలునుంచి విడుదలైన ఇస్మాయిల్‌ తన వాటాపై ముజాహిద్‌ను ప్రశ్నించడంతో ఘర్షణ జరిగింది. కనీసం తన 500గజాల ప్లాటు ఇవ్వాలని ఇస్మాయిల్‌ డిమాండ్‌ చేశాడు. చివరికి రూ.20లక్షలిచ్చేందుకు ముజాహిద్‌ అంగీకరించాడు. డబ్బు ఇవ్వకుండా ఇస్మాయిల్‌ను హతమార్చాలనుకున్నాడు. రౌడీషీటర్లు యూసుఫ్‌గూడ ప్రభాత్‌నగర్‌వాసి జిలానీ పాషా(25), రాజేంద్రనగర్‌ జిన్నారంకాలనీకి చెందిన ఫిరోజ్‌ఖాన్‌(31)కు ఇస్మాయిల్‌ హత్య బాధ్యత అప్పగించాడు. 2022 జులై 31న రాత్రి సెటిల్‌మెంట్‌కని ముజాహిద్‌ ఫోన్‌ చేయగా, నమ్మిన ఇస్మాయిల్‌ మాదాపూర్‌ వెళ్లాడు. అక్కడే ఇస్మాయిల్, ముజాహిద్‌ మాట్లాడుతుండగా పథకం ప్రకారం ద్విచక్ర వాహనంపై ఫిరోజ్‌తో కలిసి వచ్చిన జిలానీపాషా గన్‌తో ఇస్మాయిల్‌ తలపైకాల్చడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మాదాపూర్‌ పోలీసులు 2022, ఆగస్టు 1న ముజాహిద్, జిలానీ, ఫిరోజ్‌ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు అధికారులు రవీంద్రప్రసాద్, తిరుపతి చాకచక్యంగా హత్య వివరాలను కోర్టుకు సమర్పించడంతో సోమవారం కూకట్‌పల్లి 6వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సి.పావని ముగ్గురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


నమ్మించి నట్టేట ముంచి..!

రూ.23.32 కోట్ల వసూలు చేసి ఉడాయించిన వైనం

హయత్‌నగర్, న్యూస్‌టుడే: చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలుచేసి ఉడాయించిన ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన చిట్టెటి మధుసూదన్‌రెడ్డి కుటుంబంతో కొన్నేళ్లుగా హయత్‌నగర్‌ రాజరాజేశ్వరి కాలనీలో ఉంటున్నాడు. ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకొని చిట్టీలు, వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. స్వగ్రామంలో 100ఎకరాల మామిడి తోట, హయత్‌నగర్‌లో సొంతిల్లు, ప్లాట్లు ఉన్నాయని నమ్మించాడు. దాదాపుగా 137మంది నుంచి రూ.23.32కోట్లు తీసుకొని కొద్ది రోజులుగా ముఖం చాటేశాడు. పలువురు బాధితులు ఆదివారం రాత్రి హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హయత్‌నగర్‌ సీఐ రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని