logo

ఖజానా వెల వెల.. పనులు చేసేదెలా..?

రాజధానిలో కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆచూతూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నదిపై 14 వంతెనలను నిర్మించాలన్న గత ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఒక్కటి మినహా మిగిలినవి పక్కన పెట్టాలని నిర్ణయించింది.

Published : 01 Jul 2024 04:24 IST

కీలక ప్రాజెక్టులపై ఆచితూచి అడుగులు
మూసీపై వంతెనల నిర్మాణాన్ని పక్కన పెట్టిన సర్కారు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఆచూతూచి అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నదిపై 14 వంతెనలను నిర్మించాలన్న గత ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఒక్కటి మినహా మిగిలినవి పక్కన పెట్టాలని నిర్ణయించింది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ) కింద మూడో దశలో చేపట్టే పనులు సైతం దాదాపుగా నిలిచిపోనున్నాయి. ఇందుకు నిధుల లేమి కారణమని చెబుతున్నారు. మరికొన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతే ఆమోదముద్ర వేయాలని సర్కార్‌ భావిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించారు.


మరికొన్ని ఇలా..

  • గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ వైపు రూ.175 కోట్లతో నిర్మితమవుతున్న ఆకాశమార్గం పనులు నిలిచిపోయాయి. నిధుల లేమితో ఈ వంతెనకు భూసేకరణను అధికారులు ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. 
  • సంతోష్‌నగర్‌ దగ్గర రూ.300 కోట్లతో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గుత్తేదారు నెమ్మదిగా చేస్తున్నారు. ఏడాది కిందటే పనులు పూర్తి చేయాల్సి ఉంది. 
  • ఆరాంఘర్‌-జూపార్కు బ్రిడ్జి నిర్మాణం పనులు అంతమాత్రంగానే జరుగుతున్నాయి. నిధులు లేకపోవడంతో రెండోదశ కింద మరో రూ.4 వేల కోట్లతో చేపట్టే పనులను నిలిపివేశారు. మూడో దశ కింద చేపట్టే పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు.

నత్తనడకన ఎస్‌ఆర్‌డీపీ పనులు

నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ఎస్‌ఆర్‌డీపీ నిధులతో ఆకాశమార్గాలు, రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులు చేపట్టాలని గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. మొదటి దశ కింద రూ.5 వేల కోట్లతో పనులు పూర్తి చేశారు. రెండో దశలో మరో రూ.5 వేల కోట్లతో పనులు చేయాలనుకున్నారు.ఇందులో రూ.వెయ్యి కోట్ల పనులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి దశ కింద రుణం తీసుకుని పనులు పూర్తి చేశారు. రెండో దశకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో బడ్జెట్‌లో రూ.3500 కోట్ల నిధులను కేటాయించాలని బల్దియా అధికారులు గత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి ఆమోదముద్ర వేయలేదు. ఫలితంగా  కీలక ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. కొన్నింటిలో పనులు ఆగిపోయాయి.


సుందరీకరణకే మొగ్గు..

మూసీ నదిపై 14 బ్రిడ్జిలను నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో తలపెట్టారు. దీనికి రూ.550 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం మూసారాంబాగ్‌ దగ్గర మాత్రమే మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. మిగిలిన 13 చోట్ల పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేయమని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. వచ్చే మూడేళ్లలో మూసీ సుందరీకరణను పూర్తి చేసి అవసరమైన చోట వంతెనలు నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరమేముందనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. నిధుల సమీకరణను బట్టే కొత్త ప్రాజెక్టులను మొదలపెట్టాలని నిర్ణయించారు. నిధులు లేకుండా అప్పటికప్పుడు చేపటొద్దని సర్కారు కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని