logo

అడ్డదారి.. అపాయకారి

బడికెళ్లే పిల్లలకు ప్రభుత్వ చట్టాలు, నిబంధనల గురించి అవగాహన కల్పిస్తేనే భవిష్యత్తులో పాటిస్తారు. మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాంటి చిన్నారుల కళ్ల ముందే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే...!

Published : 01 Jul 2024 04:14 IST

పాఠశాలలకు ప్రమాదకరంగా బడి పిల్లల తరలింపు

చిన్నారులను పరిమితికి మించి ప్రమాదకరంగా తీసుకెళ్తున్న ఆటోవాలా

ఈనాడు- హైదరాబాద్‌: బడికెళ్లే పిల్లలకు ప్రభుత్వ చట్టాలు, నిబంధనల గురించి అవగాహన కల్పిస్తేనే భవిష్యత్తులో పాటిస్తారు. మంచి పౌరులుగా ఎదుగుతారు. అలాంటి చిన్నారుల కళ్ల ముందే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే...! వారూ భవిష్యత్తులో అలాగే చేసే అవకాశం ఉంది. పలువురు తల్లిదండ్రులు సైతం హెల్మెట్‌ ధరించకపోవడంతో పాటు చిన్నారుల్ని వాహనంపై రాంగ్‌రూట్లో తీసుకెళ్తున్నారు. ఇక స్కూల్‌ బస్సులు, ఆటోలు, వ్యాన్లు వంటి ప్రైవేటు వాహనాల్లో రవాణా మరింత దారుణంగా ఉంటోంది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు 27న స్కూల్‌ వాహనాల్ని తరలించే వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా... ఒకేరోజు 564 మంది నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడ్డారు. వారందరిపైనా కేసులు నమోదు చేశారు. 

నిర్లక్ష్యం జరుగుతోందిలా..!

బడిబస్సుల విషయంలో పాఠశాలల యాజమాన్యాలు, రవాణా శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి 12,631 బడి బస్సులు ఉండగా అందులో 876 వాహనాలు ఇంకా ఫిట్‌నెస్‌ తీసుకోకపోవడం దీనికి నిదర్శనం. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో రవాణా శాఖ తనిఖీలు నిర్వహిస్తున్నా ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు సైతం ప్రైవేటు ఆటోలు, వ్యాన్లు, ఇతర వాహనాల్లో చిన్నారుల్ని పంపించే ముందు డ్రైవరు అనుభవజ్ఞుడేనా.. వాహనానికి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పట్టించుకోవడం లేదు. 

నిబంధనలివీ..!

  • ముగ్గురు ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలో 12 ఏళ్ల లోపు విద్యార్థులు ఆరుగుర్ని మాత్రమే తరలించాలి.
  • నలుగురు ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలో 8 మంది చిన్నారుల్ని తీసుకెళ్లాలి. 
  • స్కూల్‌ బస్సు లేదా ప్రైవేటు వాహనం ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తప్పనిసరి.
  • డ్రైవరుకు వాహనం నడపడంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్లు మించి ఉండకూడదు. బస్సులో డ్రైవర్‌తోపాటు సహాయకుడు ఉండాలి. 

కొన్ని ప్రమాద ఘటనలు.. 

  • జనవరిలో హబ్సిగూడలో బస్సు చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి. 
  • చిన్నారిని చూసుకోకుండా డ్రైవరు నడపడంతో చర్లపల్లి బీఎన్‌రెడ్డి నగర్‌లో బస్సుకింద పడి మూడేళ్ల చిన్నారి మరణించాడు.
  • హయత్‌నగర్‌ కుంట్లూరులో బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడంతో మూడేళ్ల చిన్నారి దుర్మరణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు