logo

ఖాళీ స్థలాలకు పన్ను కట్టండి

జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్‌టీ), జీఐఎస్‌ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది.

Updated : 01 Jul 2024 05:30 IST

నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ షురూ
పలు సేవలను పునరుద్ధరించిన  జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం పలు పౌర సేవలను పునరుద్ధరించింది. మూడేళ్ల కిందట నిలిచిన నోటరీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీ ప్రక్రియను, ఖాళీ స్థలాల పన్ను(వీఎల్‌టీ), జీఐఎస్‌ సర్వే వంటి కార్యక్రమాలను తాజాగా ప్రారంభించింది. తద్వారా పౌరులకు, బల్దియాకు మేలు జరగనుందని అధికారులు చెబుతున్నారు. జీఐఎస్‌ సర్వేతో నగరంలోని ప్రతి నిర్మాణాలన్నీ ఆన్‌లైన్‌ అవుతాయని, దీంతో ఆస్తిపన్ను పరిధిలో లేని భవనాలు, తక్కువ చెల్లిస్తున్న ఇళ్ల వివరాలను గుర్తించగలమని అధికారులు వెల్లడించారు.

యజమానులకు నోటీసులు.. మూడేళ్లుగా ఖాళీ స్థలాలు, నిర్మాణాల రిజిస్ట్రేషన్లు ‘ధరణి’ ద్వారానే జరుగుతున్నాయి. కొత్త ఇళ్లయితే రిజిస్ట్రేషన్‌తోపాటు ఆస్తిపన్ను ఏకరూప సంఖ్య, పన్ను మదింపు అప్పటికప్పుడే పూర్తవుతున్నాయి. పాత ఇళ్లయితే ఆస్తిపన్ను రికార్డుల్లో కొనుగోలుదారు పేరు చేరిపోతోంది. ఆ ప్రక్రియను మ్యుటేషన్‌ అంటారు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌తోపాటు వీఎల్‌టీ మదింపు జరుగుతోంది. దాని విలువ రిజిస్ట్రేషన్‌ విలువలో 0.5శాతం ఉంటుంది. యజమానుల నుంచి వీఎల్‌టీ వసూలుకాలేదు. చాలా సేవలు నిలిపివేశారు. సర్కారు మారడంతో.. నిలిచిన సేవలన్నింటినీ పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వీఎల్‌టీ చెల్లించాల్సిన యజమానుల ఫోన్‌ నంబర్లకు డిజిటల్‌ నోటీసు వివరాలను చేరవేశామని బల్దియా తెలిపింది.


నోటరీ స్థలాలకు..

అక్రమ నిర్మాణాలు, నోటరీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ చట్టం చెబుతోంది. కొన్నేళ్లుగా బల్దియా ఆ సేవలను అమలు చేయలేదు. తాజాగా ‘సూపర్‌ స్ట్రక్చర్‌’ కింద యంత్రాంగం ఆ సేవలను ప్రారంభించింది. నిర్మాణానికి ఇంటి నంబరు మాత్రమే మంజూరవుతుందని, యజమాని పేరు అందులో ఉండదని అధికారులు గుర్తుచేస్తున్నారు. అనుమతి లేని కట్టడాలకు, నోటరీ స్థలాలకు రెండింతల ఆస్తిపన్ను ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


జీఐఎస్‌ సర్వే

ప్రతి భవనానికి ఓ ఏకరూప సంఖ్యను జారీ చేసి, నిర్మాణాల 3డీ ఫొటోలను డిజిటల్‌ పటంలో చేర్చే జీఐఎస్‌ సర్వే నగరంలో మొదలైంది. జీహెచ్‌ఎంసీ ఇచ్చే ఏకరూప సంఖ్య జిల్లా, మండలం, కాలనీ పేరు, ఇతర వివరాలను తెలిపేదిగా ఉంటుందని, వాటన్నింటినీ డిజిటల్‌ పటంలో పొందుపర్చడంతో భవిష్యత్తులో ఏ ఇంటి చిరునామానైనా సులువుగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొదట డ్రోన్లతో నగరం మొత్తాన్ని ఫొటో తీసి, తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ప్రతి భవనం ఫొటోలను, వీధుల్లోని పార్కులు, రోడ్లు, మ్యాన్‌హోళ్లు, చెట్లను కూడా 3డీ పటంలో చేరుస్తామని అధికారులు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని