logo

ఎఫ్‌టీఎల్‌లో ఫంక్షన్‌హాళ్లు.. సర్కారు భూముల్లో రోడ్లు

శంషాబాద్‌ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్కారు భూములు, చెరువులను కబ్జా చేస్తున్న కొందరు.. ఏకంగా హిమాయత్‌సాగర్‌ చెరువునే లక్ష్యంగా చేసుకున్నారు.

Updated : 01 Jul 2024 05:32 IST

హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఫంక్షన్‌ హాల్, రహదారి. పార్కింగ్‌ కోసం మట్టితో చెరువు పూడ్చివేత

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్కారు భూములు, చెరువులను కబ్జా చేస్తున్న కొందరు.. ఏకంగా హిమాయత్‌సాగర్‌ చెరువునే లక్ష్యంగా చేసుకున్నారు. జలాశయం ఎఫ్‌టీఎల్‌లోనే ఫంక్షన్‌హాల్‌ నిర్మించారు. ఇంతటితో ఆగకుండా అక్కడికి రాకపోకల కోసం ప్రభుత్వ భూముల్లో సిమెంట్‌ రోడ్లను నిర్మించారు. వాహనాలు నిలిపేందుకు స్థలం సరిపోక చెరువును ఒకవైపు నుంచి క్రమంగా మట్టితో పూడ్చేస్తున్నారు. కొన్నినెలల నుంచి ఈ తంతు నడుస్తున్నా శంషాబాద్‌ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌ను మట్టి, కంకర, నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేస్తున్నా ఇరిగేషన్‌శాఖ, జలమండలి అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో డిమాండ్‌ను ముందుగానే ఊహించిన అక్రమార్కులు మరో రెండెకరాల్లో చెరువును పూడ్చేస్తున్నారు. కుంగిపోకుండా గట్టిగా చదును చేస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఈ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంకకు కొత్వాల్‌గూడ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కాలిబాటను కూడా ఆక్రమించారని శంషాబాద్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కొత్వాల్‌గూడ గ్రామస్థులు వారికి వివరించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని