logo

పాఠశాల బాగుపడేలా.. ఫలితం మెరుగుపడేలా

విద్యా వ్యవస్థ సజావుగా సాగేందుకు సర్కారు రకరకాల యత్నాలు చేస్తోంది.  విద్యార్థులు పాఠశాలలకు రావడం, తరగతులు జరగడం వంటివి నిత్యకృత్యమైనా ఫలితాల దగ్గరకొచ్చే సరికి ఎక్కడో అడుగున ఉంటున్నారు.

Updated : 01 Jul 2024 04:02 IST

తల్లిదండ్రులతో సమావేశం పక్కా అమలుకు చర్యలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: విద్యా వ్యవస్థ సజావుగా సాగేందుకు సర్కారు రకరకాల యత్నాలు చేస్తోంది.  విద్యార్థులు పాఠశాలలకు రావడం, తరగతులు జరగడం వంటివి నిత్యకృత్యమైనా ఫలితాల దగ్గరకొచ్చే సరికి ఎక్కడో అడుగున ఉంటున్నారు. ఇందుకు ఉదాహరణగా రెండేళ్లుగా పది ఫలితాల్లో జిల్లా స్థానాన్నే పేర్కొనవచ్చు. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడేందుకు, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

విద్యా సంవత్సరం ఆరంభం నుంచే జాగ్రత్తలు 

పాఠశాలల అభివృద్ధి, పిల్లల పురోగతి తెలుసుకునేందుకు ప్రతి నెల మూడో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కచ్చితంగా సమావేశం నిర్వహించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. పర్యవేక్షణ సరిగ్గా లేక అమలు కావడంలేదు. ఈసారి మాత్రం వీటిని ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే సమర్థంగా అమలు చేయాలని, ఇందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులను సమాయత్తం చేయాలని అధికారులు యత్నిస్తున్నారు. 

పదో తరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా రెండు సార్లు అట్టడుగు స్థానంలో నిలవడాన్ని నివారించడంతో పాటు మంచి ఫలితాలను సాధించడానికి వీలుగా విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వామ్యం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.  

పురోగతి, హాజరు, ప్రవర్తనపై చర్చ

ప్రతి నెల తరగతుల వారీగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించాలి. విద్యార్థుల పురోగతి, హాజరు, ప్రవర్తన, సమస్యలు, అలవాట్లు తదితర అంశాలపై చర్చించాల్సి ఉంటుంది. విద్యా ప్రమాణాలు, సౌకర్యాల మెరుగుపై తల్లిదండ్రుల సూచనలు స్వీకరిస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరైనా హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. అయితే సమావేశానికి తల్లిదండ్రుల హాజరే సమస్యగా మారుతోంది. దీన్ని అధిగమించి పాఠశాల అభివృద్ధికి సలహాలతో పాటు విద్యార్థుల పురోగతి, ఇంటి వద్ద అభ్యసిస్తున్నాడా, హోంవర్కు చేస్తున్నారా లేదా అనే వివరాలు సేకరించనున్నారు.

గ్రేడ్‌ల వారీగా విభజన..

ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా విద్యార్థులను ఏ, బీ, సీ గ్రేడ్‌ల వారీగా విభజించనున్నారు. చురుకైన వారిని ‘ఎ’, మధ్యస్తం ‘బి’, వెనుకబడిన వారిని ‘సి’ గ్రేడులో ఉంచి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి బోధన చేయనున్నారు. రానున్న పదోతరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు.  


మంచి మార్పు వస్తుంది
- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడంతో విద్యార్థుల పురోగతిలో మార్పు వస్తుంది. విద్యార్థులు రోజూ హాజరవుతారు. ఇంటి వద్ద అభ్యసనంపై పర్యవేక్షణ పెరుగుతుంది. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుని అందుకు అనుగుణంగా సూచనలు చేయవచ్చు. మధ్యాహ్న భోజనం పథకం తీరుపై కూడా పర్యవేక్షణ పెరుగుతుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని