logo

నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు

రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అందుకే ఈ నెల 1 నుంచి నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.

Published : 01 Jul 2024 03:43 IST

వాహన ర్యాలీలో పాల్గొన్న అధికారులు (పాత చిత్రం) 

న్యూస్‌టుడే, వికారాబాద్‌: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. అందుకే ఈ నెల 1 నుంచి నూతన రహదారి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. 

కుటుంబాలకు చేదు జ్ఞాపకాలు  

మద్యం మత్తు, ఇష్టారీతిన నడపడం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల కుటుంబాలకు చేదు జ్ఞాపకాలే మిగులుతున్నాయి. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు(మైనర్లు) వాహనాలు ఇవ్వడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగితే అందరూ రెండు రోజులు హడావుడి చేసి మర్చిపోతారు. కన్నవారు, కట్టుకున్న వారికి మాత్రం జీవితాంతం చేదు జ్ఞాపకమే మిగులుతోంది. ఇలాంటి వాటి కట్టడికి నిబంధనలు కఠినతరం కానున్నాయి. 

  • చిన్న పిల్లలు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానాతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, పరిమితికి మించి ప్రయాణించినా, ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించకున్నా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నారు. 

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల మార్పు 

ఇప్పటి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. అక్కడ స్లాట్‌ బుక్‌ చేసుకొని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణులైతే లైసెన్స్‌ జారీ చేసేవారు. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్‌  స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రైవేటు డ్రైవింగ్‌ పాఠశాలలకు ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేసే అధికారం ఇస్తుంది.


వారం రోజులపాటు అవగాహన కల్పిస్తాం
గరాజు, సీఐ, వికారాబాద్

మారిన ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు వారం పాటు అవగాహన కల్పిస్తాం. అనంతరం చర్యలకు ఉపక్రమిస్తాం. అయితే బాలల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్న వాహనాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. లేకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని