logo

గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు

సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శామీర్‌పేట టోల్‌గేట్‌ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Published : 01 Jul 2024 03:38 IST

33 కిలోల సరకు స్వాధీనం.. ముగ్గురి రిమాండ్‌ 

గంజాయి, నిందితులను చూపుతున్న డీసీపీ కోటిరెడ్డి, ఇతర అధికారులు

శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శామీర్‌పేట టోల్‌గేట్‌ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. జూన్‌ 28న హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ రామగుండం వైపు.. అవుటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌గేట్‌ సమీపంలో ఓ బొలెరో వాహనం పనస పండ్ల లోడ్‌తో ప్రయాణిస్తోంది. ఎస్కార్టుగా స్మగ్లర్లు ఓ కారులో ముందు వెళుతున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్‌ ఎస్‌వోటీ పోలీసులు, శామీర్‌పేట పోలీసులు ఆ రెండు వాహనాలను అడ్డుకున్నారు. పనస పండ్ల మధ్య ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన శివ రాజమండ్రిలో నివాసముంటూ వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఆయన సూచనలతో ఆంధ్రప్రదేశ్‌ ఏలూరుకు చెందిన గేదెల సతీష్‌(34), కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కోరాడ సాయికుమార్‌(26), విశాఖపట్నం జిల్లా కె.కోటపాడుకు చెందిన బండారు శివకుమార్‌(27) ఒడిశాలో 33 కిలోల గంజాయిని 16 బండిళ్లుగా ప్యాకింగ్‌ చేసుకుని పనసపండ్ల లోడ్‌ మధ్య దాచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి రెండు వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని