logo

పరిగిలో దొంగల హల్‌చల్‌

తాళాలు వేసిన పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. బాధితులు, ఎస్సై సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పురపాలికలోని టీచర్స్‌ కాలనీ, వెంకటేశ్వరకాలనీల్లో నివాసముంటున్న ఆనంద్‌రావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయిరాం,

Updated : 01 Jul 2024 03:03 IST

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: తాళాలు వేసిన పలు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. బాధితులు, ఎస్సై సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పురపాలికలోని టీచర్స్‌ కాలనీ, వెంకటేశ్వరకాలనీల్లో నివాసముంటున్న ఆనంద్‌రావు, శ్రీకాంత్, శ్రీనివాస్, సాయిరాం, బంధ్యానాయక్‌ ఇళ్లకు తాళాలు వేసి  సొంత పనుల నిమిత్తం గ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడ్డారు. బంధ్యానాయక్‌ ఇంట్లో సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి వస్తువులు, రూ.1.20 లక్షల నగదును దోచుకెళ్లారు. మరో వ్యక్తి శ్రీకాంత్‌ ఇంట్లో 3.3 తులాల బంగారు నగలు అపహరించారు. మిగతా వారి నివాసాల్లో ఏమీ దొరకక ఇంట్లో వస్తువులను చెల్లాచెదరుగా వేసి వెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా.. క్లూస్‌టీం ద్వారా దొంగల వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.


పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీ

కాప్రా: పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీకి గురైన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. కాప్రాలోని శ్రీనివాస్‌ ఆఫీసర్స్‌ కాలనీలోని పిన్నమనేని అపార్టుమెంట్‌లో నివాసముంటున్న ప్రభాకర్‌రెడ్డి విశ్రాంత ఉద్యోగి. సెల్లార్‌లో నిలిపిఉన్న యాక్టివా ద్విచక్ర వాహన్ని శనివారం దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం 8.40 గంటల ప్రాంతంలో అపార్టుమెంటులోకి.. ఓ యువకుడు ముఖానికి మాస్కు పెట్టుకుని వచ్చాడు. లిఫ్ట్‌లో అయిదు అంతస్తులు కలియతిరిగాడు. ఎవరూ లేకపోవడం చూసి సెల్లార్‌లో ఉన్న బండి తీసుకువెళ్లడం సీసీ కెమెరాల్లో నమోదైంది. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.


బిస్కెట్లలో పురుగులు.. వినియోగదారుల ఆందోళన

కాప్రా, న్యూస్‌టుడే: కాప్రాలోని ఓ బేకరీలో తినుబండారాల్లో పురుగులు రావడం కలకలం సృష్టించింది. యాప్రాల్‌కు చెందిన బత్తుల వీణ ఏఎస్‌రావునగర్‌లోని కరాచీ బేకరీలో ఆదివారం బిస్కెట్లు, పలు తినుబండారాలను కొన్నారు. ఇంటికి వెళ్లి చూడగా బిస్కెట్లలో లక్క పురుగులు కనిపించాయి. దుర్వాసన వస్తోంది. అప్పటికే కుమార్తె ఓ బిస్కెట్‌ తినేసింది. వెంటనే ఆ చిన్నారిని తల్లితండ్రులు ఆస్పత్రికి తరలించారు. సదరు బేకరీకి వెళ్లి నిలదీశారు. దుకాణదారులు దురుసుగా ప్రవర్తించడంతో, ఫిర్యాదు చేసేందుకు కాప్రా సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లారు. ఆదివారం కావడంతో అధికారులు అందుబాటులో లేక పోవడంతో వెనుదిరిగారు. సదరు దుకాణదారుపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని