logo

ఎవరి దారి వారిదే

ఏదైనా పని చేపట్టే ముందు భవిష్యత్తునూ ఆలోచించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.. ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా అవుతుంది.

Updated : 30 Jun 2024 06:25 IST

ఎన్‌హెచ్, మెట్రోమధ్య సమన్వయ లోపం 
ఒకే మార్గంలో రెండేసిసార్లు పనులతో ప్రజాధనం వృథా

వనస్థలిపురంలో జాతీయ రహదారుల సంస్థ మొదలెట్టిన పైవంతెన పనులు 

ఈనాడు, హైదరాబాద్‌: దైనా పని చేపట్టే ముందు భవిష్యత్తునూ ఆలోచించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.. ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా అవుతుంది. ఇందుకు మెట్రో, జాతీయ రహదారుల సంస్థ తీరే నిదర్శనం. వనస్థలిపురంలో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్‌ నిర్మాణం మొదలెట్టింది. హయత్‌నగర్‌తో పాటూ ఈ మార్గంలో ఆరు చోట్ల అండర్‌ పాస్‌ కోసం పైవంతెనలు కట్టబోతున్నారు. ఇదే మార్గంలో మెట్రోరైలు విస్తరణ ప్రతిపాదనలు ఉన్నాయి. రెండు పనులు ఒకేసారి చేస్తే.. కనీసం స్తంభాల వరకైనా వేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థ సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎన్‌హెచ్‌ ఇప్పటికే పైవంతెన కోసం స్తంభాల పనులు మొదలెట్టింది. మెట్రో రైలు అధికారులేమో ఇప్పుడు వారితో చర్చలకు పూనుకున్నారు.

ప్రత్యామ్నాయాల కోసం సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడిక ఫ్లైఓవర్‌ పక్క నుంచి తప్ప మెట్రోకి మరో మార్గం లేదు. ఫలితంగా రహదారి ఇరుకుగా మారనుంది. చందానగర్‌-రాంచంద్రాపురం మార్గంలోనూ ఇదే సమస్య. ప్రభుత్వం చొరవ చూపకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం, ముందుచూపు కొరవడడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. 

అప్పటి మంత్రి ఆదేశించినా..

నగరంలో జాతీయ రహదారులపై పైవంతెనలు నిర్మిస్తే అదే మార్గంలో మెట్రోరైలు ప్రతిపాదనలు ఉంటే సమన్వయం చేసుకోవాలని గతంలో ఆ శాఖ కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌ డిజైన్లు రూపొందించాలని సూచించారు. మొదటి అంతస్తులో  వాహనాల కోసం.. ఆపైన రెండో అంతస్తులో మెట్రో వెళ్లేలా డిజైన్‌ను పరిశీలించాలని చెప్పారు. దీంతో ఎన్‌హెచ్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రోరైలు సంస్థకి లేఖలు రాశారు. జాతీయ రహదారులపై మెట్రో విస్తరణ ప్రణాళికలు ఉంటే వాటి డిజైన్లు పంపాలని కోరారు. మెట్రోరైలు సంస్థ స్పందించకపోవడంతో ఎన్‌హెచ్‌ సంస్థ వారి పనులను ఒక్కోటిగా మొదలెట్టింది. ప్రభుత్వం ఆదేశించి డీపీఆర్‌ రూపొందిస్తే తప్ప తమ దగ్గర డిజైన్లు ఎలా ఉంటాయనేది మెట్రో వాదన. దీనిపై సర్కారు నుంచి విధానపరమైన నిర్ణయం లేకపోవడమూ లోపమే.

ప్రణాళిక లేకుండా..

  • జాతీయ రహదారిపై చందానగర్‌ నుంచి రాంచంద్రాపురం వరకు పైవంతెన పనులు  ఏడాది కిందట మొదలయ్యాయి. ఇదే మార్గంలో మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్, అక్కడి నుంచి పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వరకు మెట్రో ప్రతిపాదనలు ఉన్నాయి.  ఎన్‌హెచ్‌ సంస్థ డబుల్‌ డెక్‌ డిజైన్ల కోసం ఎదురుచూసినా మెట్రోరైలు సంస్థ సమకూర్చలేకపోయింది. దీంతో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్‌ పనులను చేపట్టింది.
  • ఎల్బీనగర్, హయత్‌నగర్‌ మార్గంలో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లను చేపడుతోంది. మెట్రో విస్తరణ ప్రణాళికలూ ఈ మార్గంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి చేయాలని స్థానిక ప్రజలు, కొంతమంది అధికారులు మెట్రోరైలు సంస్థ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇప్పుడు మెట్రో వద్ద ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు ప్రాథమికంగా రూపొందించిన డీపీఆర్‌ ఉంది. 
  • వనస్థలిపురం మార్గంలో నిర్మించేవి వాహనాల అండర్‌పాస్‌ వంతెనలని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ డివైడర్‌ భాగంలో మెట్రో స్తంభాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ స్తంభాలు వేయాలంటే డీపీఆర్‌కు సర్కారు, కేంద్రం ఆమోదం వేయాలి. నిధులు కావాలి. అప్పటివరకు జాతీయ రహదారుల సంస్థ ఆగే పరిస్థితి ఉండదు.

గతంలో ఎస్‌ఆర్‌డీపీలోనూ...

బీహెచ్‌ఈఎల్‌ నుంచి వయా కొండాపూర్‌ మీదుగా లక్డీకాపూల్‌ మెట్రో ప్రతిపాదన ఉండేది. ఇక్కడ ఎస్‌ఆర్‌డీపీలో ఫ్లైఓవర్లు నిర్మించారు. మెట్రోకు సంబంధించి డీపీఆర్‌ కూడా సిద్ధమైంది. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌తో సమన్వయం చేసిఉంటే మెట్రో వచ్చేది. నిధుల సమస్యతో చేపట్టలేదు. సర్కారు పైవంతెనలకే మొగ్గుచూపింది. ఇప్పుడు ఇక్కడ మెట్రో చేపట్టాలంటే భారీగా ఆస్తుల సేకరణ చేయాలి. దీంతో అటకెక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని