logo

కొలనోస్కోపీతో పేగు క్యాన్సర్‌కు ముందే నిర్ధారణ

జీర్ణకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే పెద్ద పేగు, కాలేయ, క్లోమగ్రంథి క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందే పరీక్షలు చేయించుకుంటే అడ్డుకట్ట వేయవచ్చునన్నారు.

Updated : 01 Jul 2024 11:11 IST

 మాట్లాడుతున్న డా. గురు ఎన్‌ రెడ్డి. చిత్రంలో ప్రొ.అన్నా షుహ్,  ప్రొ.శ్రవణ్‌కుమార్, ప్రొ.జాన్‌ కీసీల్, డా.జగన్నాథ్, ప్రొ.ప్రసాద్‌ అయ్యర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: జీర్ణకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే పెద్ద పేగు, కాలేయ, క్లోమగ్రంథి క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందే పరీక్షలు చేయించుకుంటే అడ్డుకట్ట వేయవచ్చునన్నారు. నగరంలోని నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల గ్యాస్ట్రోఎంటరాలజీ సదస్సు సందర్భంగా పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికాలోని మయోక్లినిక్‌ ప్రొఫెసర్‌ జాన్‌ కీసీల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొలనోస్కోపీతో పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తిస్తున్నామని,  మున్ముందు రోగి నుంచి సేకరించిన మలం పరీక్షించి పెద్దపేగు క్యాన్సర్‌ గుట్టురట్టు చేయవచ్చు అన్నారు. కాంటినెంటల్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ డా.గురు ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దపేగు క్యాన్సర్‌ తగ్గదనేది అపోహ మాత్రమేనని, ప్రస్తుత అధునాతన చికిత్సలతో 1, 2 దశల్లో ఉన్న క్యాన్సర్‌ రోగులకు పూర్తిగా నియంత్రించే అవకాశం ఉందన్నారు. పేగుల్లో ఎలాంటి కణుతులు లేనట్లు పరీక్షల్లో తేలితే...మళ్లీ పదేళ్ల వరకు కొలనోస్కోపీ అవసరం లేదన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ అన్నా షుహ్‌ మాట్లాడుతూ.. ఒక్క రక్తపు బొట్టుతో అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే ఆధునిక పరీక్షలు అందుబాటులోకి రానున్నాయన్నారు.  జీనోమ్‌ సీక్వెన్సీ ద్వారా క్యాన్సర్ల గుట్టును రట్టు చేయవచ్చునని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ ప్రొ.ప్రసాద్‌ అయ్యర్, క్యాన్సర్‌ నిపుణులు డాక్టర్‌ పి.జగన్నాథ్, గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రవణ్‌ తదితరులు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని