logo

స్వస్థలాలకు కార్మికుల మృతదేహాలు

షాద్‌నగర్‌ నియోజకవర్గం బూర్గుల శివారులో సౌత్‌గ్లాస్‌ పరిశ్రమలో శుక్రవారం  పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం శనివారం ఉస్మానియాకి తరలించారు.

Updated : 30 Jun 2024 06:25 IST

పోలీసుల నుంచి  సంఘటన వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్, షాద్‌నగర్‌ న్యూటౌన్‌: షాద్‌నగర్‌ నియోజకవర్గం బూర్గుల శివారులో సౌత్‌గ్లాస్‌ పరిశ్రమలో శుక్రవారం  పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం శనివారం ఉస్మానియాకి తరలించారు. ఈ ఘటనలో 5గురు చనిపోగా 13మంది గాయపడ్డారు.  ఘటనాస్థలంలో  మృతుల శరీర భాగాలు  ముక్కలయ్యాయి. వీటిని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. మృతుల్లో నికిత్‌కుమార్, రామ్‌సేథ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు, రామ్‌ప్రకాష్, చిత్తరంజన్‌ బిహార్‌కు, రథీకాంత్‌ ఒడిశాకు చెందినవారు.వీరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం:  యాజమాన్యాలు కనీస రక్షణచర్యలు పాటించకపోవడంతోనే తరచూ పరిశ్రమల్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శనివారం బూర్గుల పరిధిలోని సౌత్‌గ్లాస్‌ పరిశ్రమను సందర్శించారు.  ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడానని, కార్మికులకు పరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం వీవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి  సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాజమాన్యంపై హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. భాజపా నేతలు విష్ణువర్దన్‌రెడ్డి, అందె బాబయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, శీనునాయక్, సీపీఎం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, సామెల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  
పోలీసుల తీరుపై ఆగ్రహం:  పరిశ్రమలో సంఘటనా స్థలం వద్ద శుక్రవారం తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల వివరాలు కోరగా ఏసీపీ రంగస్వామి వాగ్వివాదానికి దిగారన్నారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంపై భాజపా నేత శ్రీవర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆసుపత్రిలో బాధితులను  పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని