logo

వాయు కాలుష్యం.. కబళిస్తోంది ఆరోగ్యం

జిల్లాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న తాండూరు పట్టణంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్‌ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విస్మరించింది.

Updated : 30 Jun 2024 06:27 IST

గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్‌ కలేనా..
కేంద్రం ప్రకటించిన జాబితాలో దక్కని చోటు 

తాండూరులో 2015లో వాయు  కాలుష్యాన్ని కొలిచేందుకు ఏర్పాటుచేసిన యంత్రం 

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న తాండూరు పట్టణంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్‌ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విస్మరించింది. ఏళ్ల నాటి విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయే తప్ప అధికారులు పట్టించుకోవడంలేదు. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం తెలిపిన 40 గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల జాబితాల్లో తాండూరుకు చోటు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. విమర్శలు తావిస్తోంది..

ఇక్కడే ఎందుకు అవసరమంటే..

నాపరాయి, సుద్ద, లేటరైట్‌ ఖనిజాల లోడ్‌తో రాకపోకలు నిర్వహించే వేల కొద్ది వాహనాలకు పట్టణమే అడ్డా. తద్వారా దుమ్ము, దూళి పైకి లేచి ప్రాణ వాయువు కలుషితం అవుతోంది. పట్టణానికి 10 కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న 3 సిమెంటు కర్మాగారాల నుంచి వెలువడే వాయు కాలుష్యంతో సమీప గ్రామాల ప్రజలు ఉబ్బసం, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, నేత్ర సంబంధ వంటి వ్యాధులకు గురవుతున్నారు. పైర్లపై దుమ్ము, దూళి చేరడంతో దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్‌ ఏర్పాటైతే ఇక్కడి గాలి స్వచ్ఛమైనదా? లేదా? అనే విషయంలో స్టేషన్‌ సిబ్బంది స్పష్టత ఇస్తారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తారు.

2015లో కాలుష్యాన్ని కొలిచిన పీసీబీ

తాండూరు పట్టణంలో 2015 డిసెంబరు 17న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లారీ పార్కింగ్‌ వద్ద ప్రత్యేక పరికరం ఏర్పాటు చేసింది. ఇది ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు కాలుష్యం కొలిచింది. నేషనల్‌ యాంబియెంట్‌ ఏర్‌ క్వాలిటీ స్టాండర్డ్‌ (ఎన్‌ఎఎక్యూఎలస్‌) లెక్కల ప్రకారం 100 పీఎం (పర్టిక్యులర్‌ మేటర్‌) గాఢత 100 లోపు ఉంటే సంతృప్తికరం. కాని తాండూరులో 622గా నమోదైంది. దీంతో అప్పట్లోనే వాయు కాలుష్య నియంత్రణ యంత్రాలు ఏర్పాటు చేయాలని పీసీబీ నిర్ణయానికి వచ్చినా అది జరగలేదు. ఆ తర్వాత జాతీయ స్థాయి అధికారులు పర్యటించి నిర్ధరించినా నేటికీ అతీగతీ లేదు. 

పీఎం గాఢత (నాణ్యత) ఎలా ఉండాలంటే..

  • 0.5 పాయింట్లతో ఉంటే ఉత్తమం. 
  • 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం. 
  • 100 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం. ఇలాంటి పరిస్థితిలో ఆస్తమా, గుండె జబ్బులు, ఊపిరితిత్తులసమస్యతో బాధపడేవారికి ఇబ్బంది.
  • 201 నుంచి 300 వరకు ఉంటే గాలి నాణ్యత బాగుండదు. శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. 
  • 301 నుంచి 400 పాయింట్లు ఉంటే గాలి అస్సలు బాగుండదు.
  • 401 నుంచి 500 పాయింట్లు ఉంటే ప్రమాదకర పరిస్థితి.

ఎక్స్‌రేలో బయట పడుతోంది: డాక్టర్‌ మూర్తి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌

వాయు కాలుష్యానికి లోనైన వారు రోగాల బారిన పడి ఆసుపత్రికి వస్తున్నారు. వారికి ఎక్స్‌రే తీస్తున్నపుడు ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తున్నాం. గనులు, నాపరాతి పాలీష్‌ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు మాస్క్‌లు ధరించాలి. సాధారణ ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తే మాస్క్‌లు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని