logo

మధ్యాహ్న భోజనం.. మాటలకే పరిమితమా..!

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది.

Published : 30 Jun 2024 02:54 IST

కళాశాలల్లో  అమలుకాక విద్యార్థుల అవస్థలు

వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్, పరిగి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అమలు చేయాల్సిందిగా కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. ఈ పథకాన్ని గతంలో అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం మారటంతో దీని గురించి మాట్లాడే వారు లేకుండా పోయారు.  ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

ప్రభుత్వ కళాశాలల్లో  3,984 మంది విదార్థులు

జిల్లాలోని 19 మండలాల్లో కలిపి 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 16 వేలకు       పైగా విద్యార్థులున్నారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారు 3,984 మంది ఉన్నారు.

  • ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతుంటారు. దీనికి తోడు వీరు దాదాసే 20 కి.మీ. దూరం నుంచి వస్తున్నారు. వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు నవాబ్‌పేట, ధారూర్, పూడూరు, మోమిన్‌పేట మండలాల నుంచి వచ్చే వారున్నారు. ఉదయం ఇంట్లో భోజనం సిద్ధం కాక లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోవటం లేదు. దీంతో మధ్యాహ్నం చాలా మంది ఖాళీ కడుపుతోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆకలితో విద్యార్థులు చదువుపై తగిన దృష్టిని పెట్టలేకపోతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారుతుందని అధ్యాపకులు అన్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం ఆర్‌.ఎం.సురేశ్వర స్వామి, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూ.కళాశాల, వికారాబాద్‌

అధిక శాతం పేద కుటుంబాల విద్యార్థులే చదువుకునే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రిన్సిపాల్స్‌ సమావేశంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. ఈ పథకం అమలు చేస్తే ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది.  

ఎంతో మేలు చేసినట్లవుతుంది : స్వాతి, సీఈసీ, ద్వితీయ 

జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలి. తద్వారా పేద, గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఉదయం కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు భోజనం లేకుండా ఉండటం వల్ల చదువుపై కూడా దృషి సారించలేకపోతున్నారు.

చాలా మంది బాక్స్‌లు తెచ్చుకోలేరు: సాయివిలాసిని, హెచ్‌ఈసీ, ద్వితీయ

వికారాబాద్‌ కళాశాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్లో అధిక శాతం టిఫిన్స్‌ బాక్స్‌లు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలంటే కష్టమే. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయటం వల్ల కాలేజీ మానేసి వారి సంఖ్య కూడా తగ్గుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని