logo

ప్రాణాలు చెల్లాచెదురు

ఎప్పటిలాగే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతలోనే చెవులు చిల్లులుపడేలా ఒక్కసారిగా పేలుడు. భీతావహ వాతావరణం. శరీరాలు ముక్కలై చెల్లాచెదురుగా నేలరాలాయి..

Updated : 29 Jun 2024 06:43 IST

ముక్కలైన కార్మికుల మృతదేహాలు

సౌత్‌గ్లాస్‌ పరిశ్రమలో భీతావహ వాతావరణం

కార్మికుడి మృతదేహం

ఎప్పటిలాగే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతలోనే చెవులు చిల్లులుపడేలా ఒక్కసారిగా పేలుడు. భీతావహ వాతావరణం. శరీరాలు ముక్కలై చెల్లాచెదురుగా నేలరాలాయి.. ఇదీ ఫరూక్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామ పరిధిలోని సౌత్‌గ్లాస్‌ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదం పరిస్థితి. క్షణకాలంలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు విగతజీవులుగా మారగా.. 13 మంది గాయపడ్డారు. అక్కడే ఇతర విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీశారు. ఏమైందో అర్థంకాని పరిస్థితి.

న్యూస్‌టుడే, షాద్‌నగర్, షాద్‌నగర్‌ న్యూటౌన్‌
 

ప్రమాదం జరిగిన ప్రాంతం

ఈ పరిశ్రమలో 250 మంది కార్మికులు పని చేస్తుంటారు. వీరంతా ఉత్తర్‌పదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉంటున్నారు. రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు మొదటి షిఫ్టు అయిపోతుంది. సరిగ్గా 4.45 గంటల సమయంలో విధులు ముగించుకొని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. వాహనాలకు ఉపయోగించే గాజును కరిగించే యంత్రం ఒక్కసారిగా పేలిపోయింది. అందులో కరిగిన వేడి రసాయనం కార్మికులపై పడింది. పేలుడు సంభవించిన సమయంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు తునాతునకలై ఎక్కడెక్కడో ఎగిరిపడ్డారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మృతదేహాలను గుర్తించడానికే పోలీసులకు చాలా సమయం పట్టింది. ఘటనా స్థలానికి వెళ్లడానికి అక్కడి వారు భయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రికి తీసుకెళ్లుండగా మృతి చెందారు. హించని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కార్మికులు తేరుకోలేకోపోతున్నారు. ఇక్కడ పనిచేసిన కార్మికులందరూ 20 నుంచి 35 ఏళ్లలోపు వారే. కుటుంబ సభ్యులను సొంత రాష్ట్రంలోనే వదిలేసి పొట్ట చేతపట్టుకొని వచ్చారు. అలా వేలాది మంది కార్మికులు ఉన్నారు. చాలామంది ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా రాలిపోతున్నారు. కనీస రక్షణ ప్రమాణాలు పాటించని యాజమాన్యాల చేతుల్లో వారి జీవితాలు తెల్లారుతున్నాయి.

నిపుణులు ఎక్కడ?.. సాంకేతిక పరమైన పనుల్లో నైపుణ్యం లేని కార్మికులను నియమించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, మల్లాపూర్‌ తదితర పరిశ్రమల్లో జరిగిన ఘటనల్లోనూ అనేక మంది బలయ్యారు. గాయపడిన వారి పరిస్థితి దుర్భరంగా మారింది. కనీసం వారి కుటుంబాల బాగోగులు, ఆర్థికంగానూ సహాయం అందించడంలో పరిశ్రమల నిర్వాహకులు నిర్లక్ష్యం వవహిస్తున్నారు.

ఘటనాస్థలిలో మృతులు, తెగిపడిన వారి శరీర భాగాలు

ఇలా చేస్తే మేలు..

విధుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చట్టపరంగా రావాల్సిన పరిహారం ఇప్పించాలి.  

  • సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలి.
  • మరణించిన కార్మికుడికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యం లేకపోతే కార్మికశాఖ ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలి. ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన కార్మికులకు పింఛన్లు అందించాలి.
  • ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి కంపెనీలో విధిగా వర్క్‌ పర్మిట్‌ సిస్టమ్‌ అమలు చేయాలి.
  • ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలి. రియాక్టర్ల పనితీరు పర్యవేక్షించాలి. ప్రమాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించాలి.
  • ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో 24గంటల వైద్య సేవలు అందించాలి. లేబర్‌ ఆఫీసు, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కార్యాలయాలను జీడిమెట్లలో చేయాలి.

  • కలగా మారిన భద్రత

కార్మికుల రక్షణ విస్మరిస్తున్న యాజమాన్యాలు

ఈనాడు, హైదరాబాద్‌: పరిశ్రమల్లో లోపించిన భద్రతా ప్రమాణాలతో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరేవరకూ అనుమానమేనన్న పరిస్థితి నెలకొంది. తాజాగా షాద్‌నగర్‌ జరిగిన ప్రమాదంలో పొట్టకూటి కోసం వచ్చిన అమాయకులు బలయ్యారు. కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారుల ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమయ్యే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కీలక ప్రాంతాల్లో నిపుణులైన కార్మికులు పనిచేయాల్సి ఉండగా..తక్కువ జీతాలకు పనిచేసేందుకు వస్తున్నారని.. కనీస అవగాహన లేని తాత్కాలిక, కాంట్రాక్ట్‌ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు సంభవిస్తున్నాయి. జీడిమెట్ల, నాచారం, కాటేదాన్, షాద్‌నగర్‌లలో మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందగా 50 మంది గాయాల పాలయ్యారు. 

స్థానికేతరులే ఎక్కువగా.. విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండటంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా శివార్లలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌లాంటి వాహనాలు లేక నగరానికి చేరేలోపు మరణిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. పరిశ్రమల్లో రక్షణ చర్యలు సక్రమంగా లేకున్నా..వాటిని పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని