logo

గుప్పిట గులాబీ

రాజధానిలో కాంగ్రెస్‌ బలం పెంచుకోవడానికి వేసిన వ్యూహంలో భారాస ఎమ్మెల్యేలు చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మొదలైన మార్పు కొనసాగింపేనని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated : 29 Jun 2024 04:56 IST

రాజధానిలో కారు దిగుతున్న భారాస ఎమ్మెల్యేలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో కాంగ్రెస్‌ బలం పెంచుకోవడానికి వేసిన వ్యూహంలో భారాస ఎమ్మెల్యేలు చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మొదలైన మార్పు కొనసాగింపేనని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ ఆకర్ష్‌ ఫలితమిస్తోంది. హైదరాబాద్‌ సమీప జిల్లాల్లో భారాసకు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ పెద్దఎత్తున దృష్టి సారించింది. కొంతమంది ఎమ్మెల్యేలు తక్షణం పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతుండగా.. మరికొద్ది మంది కొంత కాలం వేచి చూసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. చేవెళ్ల సీనియర్‌ భారాస ఎమ్మెల్యే యాదయ్య శుక్రవారం దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరారు. వచ్చే నెల రోజుల్లో మరో అయిదుగురుని పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అతి తక్కువ స్థానాలను సాధించింది. ఈ జిల్లాల్లో  29 స్థానాలుంటే కాంగ్రెస్‌ మూడు స్థానాలకే పరిమితమైంది. భారాస 18 స్థానాల్లో, ఎంఐఎం ఏడు, భాజపా ఒక్క స్థానంలో గెలుపొందాయి. 

పట్టు పెంచుకోవడానికి..: హైదరాబాద్‌ నగర పరిధిలో పట్టు పెంచుకోవడానికే భారాస ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో భారాస ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడం లేదు. అధికారులు మాట వినడం లేదు. అభివృద్ధి పనుల్లో  భాగస్వామ్యం ఉండటం లేదని భావిస్తున్న వారిని మెల్లగా దారిలోకి తెచ్చుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాళ్లకు నియోజకవర్గంలో మళ్లీ పెత్తనం కొనసాగించుకోవడానికి అధికారం కావాలనే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వచ్చారు. పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో ఆయన వెనకడుగు వేశారు.  ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జానారెడ్డిని కలిసి వచ్చారు. ఆయన

కాంగ్రెస్‌ పార్టీలోకి చేరే అవకాశం ఉందని అంటున్నా... దీన్ని ఆయన ఖండిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మంతనాలు జరుగుతున్నాయని... ఒకరిద్దరు తప్ప నగరానికి చెందిన భారాస ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో చేరతారని దానం పేర్కొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని