logo

సర్కారు బడులకు వెళ్తామన్నా.. వదలని ప్రైవేటు స్కూళ్లు

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాధ భరించలేక సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వదలడం లేదు.

Published : 29 Jun 2024 02:22 IST

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 

ఈనాడు, హైదరాబాద్, ముషీరాబాద్, జీడిమెట్ల, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాధ భరించలేక సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వదలడం లేదు. వారికి టీసీలు ఇవ్వకపోగా.. తమ వద్ద సదరు విద్యార్థి లేరంటూ ఆన్‌లైన్‌లో వివరాలనూ నమోదు చేయకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినా హాజరుపట్టీలో పేర్లు ఉండకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని బహదూర్‌పురా, చార్మినార్, ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్, అమీర్‌పేట్, కుత్బుల్లాపూర్‌  మండలాలతో పాటు సైదాబాద్, మలక్‌పేట్‌ ప్రాంతాల్లోని ఐదు వేల మందికిపైగా ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు తక్షణం చొరవతీసుకుని ఆయా సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ఆంగ్లభాష నేర్పిస్తారని..

ప్రైవేటు స్కూళ్లు.. కార్పొరేటు విద్యాసంస్థల్లో పిల్లలకు ఆంగ్లభాష బాగా నేర్పిస్తారన్న ఆశతో రూ.వేలకువేలు ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు.. పిల్లలకు ఆంగ్లం సరిగా రావడం లేదని గ్రహిస్తున్నారు. ఫీజుల భారం భరించలేని వారిలో కొందరు.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఒక జిల్లాలోని విద్యార్థి అదే జిల్లాలో వేరే పాఠశాలలో చేరితే.. తొలుత చదివిన పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థి వివరాలను ఆన్‌లైన్‌లోని డ్రాప్‌బాక్స్‌లో నమోదు చేయాలి. ఇలా చేయకపోతే వేరే పాఠశాలలో విద్యార్థి చదువుతున్నా పాత బడిలోనే వివరాలుంటాయి. మండలాలవారీగా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలి. ఇందుకుభిన్నంగా హైదరాబాద్‌ విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చార్మినార్‌ మండల పరిధిలోని కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు బహదూర్‌పురలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నా...ఇప్పటికీ ప్రైవేటు స్కూళ్లల్లోనే వారి పేర్లున్నాయి. కొందరు సిబ్బంది ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల నుంచి మామూళ్లు తీసుకుని ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని