logo

ఇసుకలో.. కాసుల వేట

జిల్లాల్లోని యాలాల మండలంలో కాగ్నానది పరివాహక ప్రాంతాలైన కోకట్, బెన్నూర్‌ సంపు, సంగెంకుర్థు, విశ్వనాథ్‌పూర్, నాగాసాముందార్, దేవనూర్, యాలాల కాకరవేణి నది ఉండడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి

Published : 29 Jun 2024 02:13 IST

ప్రభుత్వ అనుమతుల పేరుతో అక్రమ దందా 
కాగ్నానది పరిసరాల్లోంచి తరలింపు 

కాగ్నా నది వద్ద పట్టుబడిన ట్రాక్టర్లు

జిల్లాల్లోని యాలాల మండలంలో కాగ్నానది పరివాహక ప్రాంతాలైన కోకట్, బెన్నూర్‌ సంపు, సంగెంకుర్థు, విశ్వనాథ్‌పూర్, నాగాసాముందార్, దేవనూర్, యాలాల కాకరవేణి నది ఉండడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్రమార్కుల దృష్టి వాటిపై పడింది. కలెక్టర్‌ ఆదేశాలతో యాలాల, తాండూరు మండలాల తహసీల్దార్లు ఇసుకకు అనుమతులు ఇస్తున్నారు. అయితే అనుమతులున్న ప్రాంతంలో ఇసుక వేయకుండా మరోచోటుకు తరలించి అందినంత జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

వారం రోజుల నుంచి బెన్నూర్‌ సంపు దగ్గర ఇసుక దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటి నిర్మాణాలకు అధికారుల దగ్గర అనుమతి పత్రాలు తీసుకొని ఎంపికచేసిన చోటు కాకుండా మరో చోటుకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 150 ట్రిప్పులపైనే రవాణా జరుగుతోంది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తప్పనిసరి కావడంతో ప్రభుత్వ పనుల పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌లో మూడు క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు రూ.600 చొప్పున జిల్లా కలెక్టర్‌ పేరిట డీడీ సంబంధిత బ్యాంకులో కట్టి తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించి అనుమతులు తీసుకుంటున్నారు. నాలుగు ట్రిప్పులకు పర్మిషన్‌ తీసుకొని ఎనిమిది నుంచి పది ట్రిప్పుల తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు సుమారు రూ.5 వేల చొప్పున అమ్ముకొని జేబులు నింపుకొంటున్నారు. తాండూరు పట్టణం, మండలంతో పాటు, యాలాల మండలం, కొడంగల్‌ మండలాలకు ఇసుకను తరలిస్తున్నారు. 

పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా...

అనుమతులు లేకుండానే గత వారంలో మూడు సార్లు కాగ్నానదిలో దాదాపు 15 ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని పట్టుకొని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. మరికొన్నింటికి జరిమానా విధిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. యథేచ్ఛగా రవాణా కొనసాగుతోంది.

క్షేత్రస్థాయిలో కరవైన పర్యవేక్షణ

తహసీల్దార్‌ కార్యాలయంలో అనుమతులు  ఇస్తున్నప్పటికి క్షేత్రస్థాయిలో అందుకు అనుగుణంగా అధికారులు పర్యవేక్షణ కరవైంది. ఇసుక తరలించే చోట సంబంధిత అధికారులు ఉండి ఎన్ని ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చాం, ఎన్ని ట్రిప్పులు  తీసుకెళ్తున్నారో పరిశీలించాలి. కానీ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఇదే అదనుగా భావించి రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. 


కఠిన చర్యలు తీసుకుంటాం  

ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఈ విషయమై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇప్పటికే 10 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశాం. ఇక నుంచి నిరంతరం నిఘా ఉంచుతాం.  

-విఠల్‌రెడ్డి, యాలాల ఎస్సై. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని