logo

సకుటుంబ సమేతం నేరకథా చిత్రమ్‌.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వాస్తవాలు..

ఆమె తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ జనరల్‌ మేనేజర్‌. బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన ఖాతాదారులను తప్పుదారి పట్టించారు.

Updated : 27 Jun 2024 08:04 IST

ఇంటిల్లిపాదీ ఆర్థిక మోసాలు.. డ్రగ్స్‌ దందాలు

ఆమె తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ జనరల్‌ మేనేజర్‌. బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన ఖాతాదారులను తప్పుదారి పట్టించారు. తన భర్త, కుమారుడు ప్రారంభించిన ఫైనాన్స్‌ సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవచ్చని ఆశచూపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని వందలాది మందితో రూ.200 కోట్లను అక్కడకు మళ్లించారు. మొదట్లో లాభాలు చెల్లించినా  ముఖం చాటేశారు. బాధితులు మోసపోయినట్టు గుర్తించి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు.

అతడు బ్యాంకు మేనేజర్‌. వ్యక్తిగత రుణాలకు సంబంధించిన దరఖాస్తులన్నీ అతడి పరిశీలనకే వస్తుంటాయి. అలా వచ్చిన 26 మంది దరఖాస్తుల ద్వారా రూ.3.88కోట్ల రుణం తీసుకొన్నారు. ఖాతాదారుల పేరిట రామంతాపూర్, మహేంద్రహిల్స్‌లోని బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకున్నాడు. వాటిని మొదట భార్య బ్యాంకు ఖాతాల్లో జమచేశాడు.తర్వాత తన ఖాతాల్లోకి వేసేవాడు. అంతర్గత ఆడిటింగ్‌లో బాగోతం బయటపడింది.

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన కేసుల్లో ఇవి ఉదాహరణలు మాత్రమే. కొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు గుర్తించినా సరైన ఆధారాలు లభించకపోవటంతో తప్పించుకుంటున్నారని ఒక ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఏదైనా ఇంట్లో ఒకరిద్దరు తప్పటడుగులు వేస్తారు. విలాస జీవితం గడిపేందుకు నేరాల బాట పట్టడం గమనిస్తుంటాం. నగరంలో తాజాగా నమోదవుతున్న పోలీసు కేసుల్లో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంటిల్లిపాదీ ఆర్ధిక మోసాలు, డ్రగ్స్‌ దందాల్లో పాలుపంచుకుంటున్న సంగతులు దర్యాప్తులో బయటపడటం పోలీసులనూ విస్మయానికి గురిచేస్తోంది. వీరిలో అధికశాతం లగ్జరీ నివాసాలు, ఖరీదైన కార్లలో తిరగాలనే మోజుతో తెగిస్తున్నారు.

అనుభవించు రాజా!

తాజాగా అంబర్‌పేట్‌ ఠాణా పరిధిలో చైన్‌స్నాచర్‌ అరెస్టయ్యాడు. భార్యను విహారయాత్రకు తీసుకెళ్లేందుకు చోరీ చేసినట్టు చెప్పాడు. నగరానికి చెందిన బ్యాంకు మేనేజర్‌. పొదుపు సంఘాల్లోని మహిళల పేరిట బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నాడు. చేతికి వచ్చిన రూ.1.5కోట్లను షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. లాభాలతో విల్లా కొనాలని, అసలు సొమ్మును బ్యాంకులో జమ చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. చివరకు షేర్‌మార్కెట్‌లో నష్టాలు రావటంతో పథకం బెడసికొట్టి జైలుపాలయ్యాడు. ముషీరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు బెంగళూరు నుంచి కొకైన్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తూ టీజీన్యాబ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. 30-40 గ్రాముల కొకైన్‌తో రూ.లక్షన్నర చేతికి అందటంతో సొంతిల్లు, కారు కొనేందుకు ఇలా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. సొంతిల్లు, కారు, విదేశీ యాత్రలు.. పిల్లలకు ఖరీదైన పాఠశాలల్లో చదువులు. సమాజంలో తమ హోదాను పెంచుకోవాలనే ఆలోచనతో తప్పటడుగులు వేస్తున్నారు. ఎటువంటి వైద్యపరిజ్ఞానంలేని ఒక వ్యక్తి డాక్టర్‌గా చెలామణీ అయ్యాడు. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రమాదకరమైన జబ్బులు తగ్గిస్తానంటూ ఊదరగొట్టాడు. శివారు ప్రాంతాల్లో వెల్‌నెస్‌ రిసార్ట్స్‌లో సేదతీరుతూ.. ఆనందం.. ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటూ రూ.లక్షలు సేకరించాడు. స్థిరాస్తి సంస్థలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావచ్చనే ఆశతో వందలాది మందిని మోసగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని