logo

PV Narasimha Rao: 16 భాషల పీవీ 16 అణాల ఠీవి

దేశానికి ఏకైక తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు కీర్తి ‘భారత రత్న’ పురస్కారంతో నింగినంటింది. 16 భాషలు తెలిసిన పదహారణాల పీవీ.. జన్మించింది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అయినా నాయకుడిగా ఎదిగింది నగరంలోనే. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డగా పేరొందిన పీవీ.. ఆంగ్లేయులు నిషేధించిన ‘వందేమాతరం’ గీతాన్ని 1938లో వారి ఎదుటే సహచర విద్యార్థులతో కలిసి వర్సిటీలో ఆ గీతాన్ని ప్రాంగణమంతా ప్రతిధ్వనించేలా ఆలపించారు.

Updated : 10 Feb 2024 07:42 IST

నగరంతో ఆత్మీయ అనుబంధం 

దేశానికి ఏకైక తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు కీర్తి ‘భారత రత్న’ పురస్కారంతో నింగినంటింది. 16 భాషలు తెలిసిన పదహారణాల పీవీ.. జన్మించింది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అయినా నాయకుడిగా ఎదిగింది నగరంలోనే. ఉస్మానియా విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డగా పేరొందిన పీవీ.. ఆంగ్లేయులు నిషేధించిన ‘వందేమాతరం’ గీతాన్ని 1938లో వారి ఎదుటే సహచర విద్యార్థులతో కలిసి వర్సిటీలో ఆ గీతాన్ని ప్రాంగణమంతా ప్రతిధ్వనించేలా ఆలపించారు. ఫలితంగా ఆయనతోపాటు పలువురికి ప్రవేశాలను వర్సిటీ రద్దు చేయటంతో పీవీ నాగ్‌పుర్‌లో డిగ్రీ చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా నగరాభివృద్ధికి అందించిన తోడ్పాటు కారణంగా ఆయన మరణాంతరం నెక్లెస్‌ రోటరీలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్మృతి వనాన్ని నెలకొల్పారు. నెక్లెస్‌రోడ్‌ను పీవీమార్గ్‌గా మార్చారు. మెహిదీపట్నం నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారధికి పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేగా నామకరణం చేశారు. తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయానికి ముందు పీవీ పేరు పెట్టారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి పీవీకి భారతరత్న లభించడం ఎంతో గర్వంగా ఉందని వర్సిటీ వీసీ డి.రవీందర్‌ తెలిపారు.

తెలుగుపై మిక్కిలి మక్కువ...  

తెలుగుభాషపై మక్కువ కలిగిన పీవీ నరసింహారావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రెండుసార్లు సందర్శించారు. మహాకవి డా.సి.నారాయణరెడ్డి తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులయ్యాక 1991లో రెండో స్నాతకోత్సవానికి స్వయంగా దిల్లీకి వెళ్లి పీవీని ఆహ్వానించారు. ఆయన అప్పటికింకా ప్రధాని కాలేదు. సినారెకు ఇచ్చిన మాట కోసం 1991 జులైలో  నగరానికి వచ్చి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ‘దిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే’ అని సగర్వంగా చెప్పుకొన్నారు. దేశ ప్రధాని అయ్యాక ఆయన పాల్గొన్న తొలి సమావేశం ఇదే. ప్రధాన మంత్రి తెలుగులో పూర్తి ప్రసంగం చేయడం కూడా ఇదే మొదటిసారి.

  • 1993లో మరోమారు తెలుగు వర్సిటీలో జరిగిన నాటి స్వాతంత్య్ర సమరయోధుడు, భారతీయ విద్యాభవన్‌ ప్రిన్సిపల్‌గా ఉన్న వీహెచ్‌ దేశాయ్‌ విరచిత ‘వందేమాతరం టు జనగణమన’ పుస్తకావిష్కరణ సభలో  పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. జనసైనికుల నాయకుడు, స్వామి రామానందతీర్థ ఆశ్రమానికి అధ్యక్షుడుగా ఉన్నారు.
  • పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషాభివృద్ధికి ‘తెలుగు అకాడమీ’ని స్థాపించారు. ఆయనే దానికి మొదటి అధ్యక్షుడు.

అవధానంలో పీవీ..

రవీంద్రభారతిలో మాడుగుల నాగఫణి శర్మ సహస్రావధానంలో పీవీ పృచ్ఛకులుగా పాల్గొన్నారు. సమాజంలోని ప్రశ్నలకు పద్య రూపంలో ఎలాంటి సమాధానం చెబుతారని అడిగారట. దానికి అవధాని సమాధానపరిచారట.

నేటి యువతకు ఆదర్శం

ఈనాటి యువతకు పీవీ ఓ ఆదర్శం. ఆయన ఉన్నతవిద్యా పారంగికుడేకాక బహుభాషా కోవిదుడు. వాటిని ఆయన చాలా వేగంగా నేర్చుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడే కంప్యూటర్లు వచ్చాయి. ఆంగ్లంలో టైప్‌చేయడం కొంత కష్టమైనా కొద్దిరోజుల్లోనే వినియోగించటం నేర్చారు. పాతికేళ్ల క్రితం కంప్యూటర్‌లో తెలుగుభాషను టైప్‌ చేసేందుకు ఫాంట్లు, సాఫ్ట్‌వేర్‌ రాగా అప్పుడు కూడా వేగంగా టైప్‌చేయడం నేర్చుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో నిపుణుడిగా పేరొందారు.  

లోపలి మనిషి.. బాగున్నాడా?..

ఆత్మకథను రాసుకున్న పీవీ రవీంద్రభారతిలో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలతో సమావేశమయ్యారు. ఆంగ్లంలో రాసిన ‘ది ఇన్‌సైడర్‌’ను అనువదించి ‘లోపలి మనిషి’గా ప్రచురిస్తున్నామని, బాగుందో లేదో చెప్పాలన్నారు. వారు బాగుందన్నాకే 2002 అక్టోబరులో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అన్ని భాషల్లో కలిపి 20 వేల ప్రతులు అమ్ముడై, రెండో ముద్రణకు సిద్ధమయింది. మరోవైపు అప్పటికే రెండోభాగం రాసిన పీవీ తాను మరణించాక ముద్రించాలని కుటుంబసభ్యులను కోరారు. త్వరలో ఎమెస్కో బుక్స్‌ ద్వారా ప్రచురితం కానుంది.

పీవీ కలల సౌధం.. స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రం

బేగంపేట, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆయనకు నగరంతో ముఖ్యంగా బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. నిజాం పాలన, రజాకార్ల అరాచకాల నుంచి హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగించాలని స్వామి రామానంద తీర్థ సారథ్యంలో పోరాటం చేశారు పీవీ. ఇందుకు స్వామి రామానంద తీర్థ బేగంపేట బ్రాహ్మణవాడిలో నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న భవనమే వేదిక కావడం విశేషం. పీవీ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి, బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా పనిచేస్తున్నా తన వృత్తిని వీడి రామానంద తీర్థ ఏర్పాటు చేసిన బృందంలో చేరారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలనేది వీరి లక్ష్యం. కర్ణాటకలో పుట్టి, మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్‌ సంస్థానం విమోచన కోసం పోరుబాట పట్టిన స్వామి రామానంద తీర్థ సారథ్యంలో చదువులు, వృత్తి, వ్యాపారాలు వదిలి ఉద్యమంలో పాల్గొన్నవారంతా బేగంపేటలోని రామానంద తీర్థ నివాసంలోనే సమావేశమయ్యేవారు. అప్పట్లో స్వామిజీకి పీవీ ప్రియ శిష్యుడు. అలా ఆయనకు బేగంపేటతో అనుబంధం ఏర్పడింది. తర్వాతి పరిణామాల్లో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమవ్వడం.. ఈ క్రతువులో భాగస్వాములైన రామానంద తీర్థ శిష్యుల్లో పీవీతోపాటు పాటిల్‌, ఎస్‌.బి.చవాన్‌లు కూడా తదనంతరం ముఖ్యమంత్రులు కావడం విశేషం. స్వామి రామానంద తీర్థ బేగంపేటలోనే ఉంటూ 1973లో మరణించారు. బేగంపేటలోని నివాస ప్రాంగణంలోనే ఆయనకు సమాధి కట్టారు. ఆ నివాసాన్నే 1975లో ఆయన పేరిట స్మారక కేంద్రంగా ఏర్పాటు చేశారు పీవీ.

సామాజిక సంక్షేమమే లక్ష్యం

స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రం వేదికగా పీవీ ఏర్పాటు చేసిన కమిటీ సామాజిక సంక్షేమం లక్ష్యంగా పనిచేసేది. యోగాభ్యాసంలో శిక్షణ, దేశభక్తి కార్యక్రమాలతో పాటు ఆది ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే కాంక్షతో పీవీ కృషిచేశారు. ఔషధ మొక్కల పెంపకం, ఆయుర్వేద విశిష్టతల గురించి ప్రచారం చేసేవారు. తదనుగుణంగానే తర్వాత మొయినాబాద్‌లో ఈ కేంద్రం ఆధ్వర్యంలో ఔషధ వనాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

పీవీకి ఇష్టమైన కారు..

పీవీ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉండగా సొంత ఖర్చులతో ఓ కారు కొనుగోలు చేశారు. ఎంతో ఇష్టమైన దానిలోనే ఆయన నగరంలో ఎక్కువగా తిరుగుతుండేవారు. ఈ కారు స్వామి రామానందతీర్థ స్మారక కేంద్రంలో ఇప్పటికీ భద్రంగా ఉంది.

స్మారక గ్రంథాలయానికి విశేష ఆదరణ

సుమారు పదివేల అరుదైన పుస్తకాలు కలిగిన పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయం రామానంద తీర్థ కేంద్రంలోనే ఉంది. స్వాతంత్య్రోద్యమం నాటి నుంచి పీవీ హయాం వరకు చోటుచేసుకున్న ఘట్టాలు, ప్రముఖల జీవిత విశేషాలు, జాతీయ నేతల అరుదైన ప్రసంగాలు, అనాడు లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చల విశేషాలు 1996లో ఏర్పాటైన ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఆయన సేకరించుకున్న, రచయితలు బహుమతిగా ఇచ్చిన పుస్తకాలున్నాయి.

బేగంపేట ఇష్టమైన ప్రాంతం

పీవీ నరసింహారావు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఆపై భారత ప్రధానిగా విరామం లేకుండా ఉన్నా వీలు చిక్కినపుడల్లా బేగంపేటలోని రామానంద తీర్థ స్మారక కేంద్రానికి తప్పక వచ్చేవారు. తరువాతి క్రమంలో పీవీ కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు ఈ స్మారక కేంద్రం బాధ్యతలు చేపట్టి సమర్థంగా కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు