logo

Hyderabad: సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో మాయాజాలం ప్రదర్శించి వెయ్యిగజాల సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు.

Updated : 29 Jun 2024 07:00 IST

జీవో నంబర్‌ 59తో క్రమబద్ధీకరణ

భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనం.. 

ఈనాడు,హైదరాబాద్, రాయదుర్గం, న్యూస్‌టుడే: గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో మాయాజాలం ప్రదర్శించి వెయ్యిగజాల సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. ఖాజాగూడలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఎదురుగా నివాసముంటున్న వీరు.. వెయ్యి గజాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఏళ్ల తరబడి ఆ స్థలంలో ఉంటున్నామంటూ తాముంటున్న ఇంటినంబర్లతోనే జీవో నంబర్‌ 59తో క్రమబద్దీకరించుకున్నారు. అనంతరం భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకుని భవనాలు నిర్మిస్తున్నారు. ఇదంతా కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే పూర్తిచేశారు. తాముంటున్న ఇళ్లపై బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు. క్రమబద్దీకరించేటప్పుడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు పరిశీలించకపోవడం, జీహెచ్‌ఎంసీ అధికారులు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా అనుమతులిచ్చేశారు.

జీహెచ్‌ఎంసీ అధికారులూ  ఇలా చేశారు..

ఖాజాగూడలో రహదారి విస్తరణకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఐదేళ్ల క్రితం స్థల సేకరణ చేపట్టారు. 1242 గజాల స్థలంలో 204 గజాలను తీసుకున్నారు. నష్టపరిహారంగా టీడీఆర్‌(ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌)ను అందజేశారు. 

  • తప్పుడు పత్రాలతో కబ్జాచేసుకున్న 1002 గజాల స్థలం ఉండగా... రెండేళ్ల క్రితం ప్రభుత్వ స్థలంలో మరో 234గజాల స్థలాన్ని కబ్జా చేసి మొత్తం 1236.5గజాల స్థలాన్ని ఓ స్థిరాస్తి సంస్థతో అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 
  • గతేడాది ఏప్రిల్‌లో ఆ స్థలంలో రెండు సెల్లార్‌లు, ఒకగ్రౌండ్‌ ఫ్లోర్‌ సహా నాలుగు అంతస్థుల భవనం నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు పదిశాతం స్థలాన్ని మార్టిగేజ్‌ చేసుకుని నిర్మాణానికి అనుమతులిచ్చారు. 

అలా కన్నేశారు... ఇలా ఆక్రమించుకున్నారు.. 

  • ఖాజాగూడ  సర్వే నం.28లో దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం 1982లో కోళ్లఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికీ 242 గజాల చొప్పున స్థలాలను కేటాయించింది. వీటిని విక్రయించకూడదు.. బదిలీ చేయకూడదన్న నిబంధనలతో ప్రభుత్వం కేటాయించగా... కొన్నేళ్లయ్యాక చాలామంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఇందులో రెండు ఇళ్ల యజమానుల వారసులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయించి సేల్‌డీడ్‌ చేశారు. వాటిని 2010లో  పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

లబ్ధిదారుల నుంచి ఇళ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు 2015లో పుప్పాలగూడలోని ఓ బ్యాంకులో తనఖా ఉంచి రూ.1.08కోట్ల రుణాన్ని తీసుకున్నారు. 


రికార్డులు పరిశీలిస్తాం: కె.వెంకట్‌రెడ్డి, ఆర్డీవో రాజేంద్రనగర్‌

ఖాళీ స్థలాన్ని వేరే నిర్మాణానికి జతచేస్తే నిబంధల ప్రకారం జీవో నంబర్‌ 59తో క్రమబద్దీకరించకూడదు. ఆరేళ్ల క్రితం క్రమబద్దీకరించారంటే రికార్డులు పరిశీలిస్తాం. అక్రమాలు జరిగాయని తేలితే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని