logo

HYD News: ప్రేమకు అడ్డొస్తున్నాడని అంతమొందించారు

ప్రేమకు అడ్డొస్తునాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలుపట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

Published : 29 Jun 2024 08:39 IST

వీడిన ఇంటర్‌ విద్యార్థి డానీష్‌ మృతి కేసు 

డానీష్‌ 

మూసాపేట: ప్రేమకు అడ్డొస్తునాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలుపట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.  పదిమంది నిందితులనుఅల్లాపూర్‌ పోలీసులు శుక్రవారం కోర్టు హాజరుపరిచారు. నిందితులంతా 20 ఏళ్లలోపువారే. కేసు వివరాలు.. కూకట్‌పల్లి అల్లాపూర్‌ డివిజన్‌లోని సఫ్దర్‌నగర్‌కు చెందిన అహ్మద్, అన్వరీబేగం కుమారుడు డానీష్‌(17) యూసుఫ్‌గూడలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. దివంగత రౌడీషీటర్‌ కుమారుడు ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థి(17)తోపాటు మరికొంత మందితో అతనికి  స్నేహం ఉంది. రౌడీషీటర్‌ కుమారుడు పదోతరగతి ఫెÆయిల్‌ కావడంతో అతను వారందరి కంటే విద్యలో ఏడాది వెనకబడి ఉన్నాడు. కళాశాలలో మిత్రులతోపాటు చదువుతున్న యువతితో రౌడీషీటర్‌ కుమారుడికి బంధుత్వం ఉంది. డానీష్‌ ఆ యువతితో చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. తను పెళ్లి చేసుకోవాలనుకున్న విద్యార్థినితో నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు డానీష్‌తో గొడవపడినట్లు సమాచారం. ఈ నెల 22న రాత్రి 9.30కు ఇంటి నుంచి వెళ్లిన డానీష్‌ తిరిగి రాలేదు. మరునాడు బోరబండ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో అతని మృతదేహం లభించింది.   హత్య కావచ్చని తల్లిదండ్రులు అల్లాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టి..  డానీష్‌ను అడ్డు తొలగించుకోవాలని రౌడీషీటర్‌ కుమారుడు మిత్రులతో వ్యూహరచన చేశాడు. శనివారం రాత్రి డానీష్‌కు రౌడీషీటర్‌ కుమారుడు ఫోన్‌ చేసి బోరబండ రైల్వే పట్టాల పక్కన ఉన్న పొదల వద్దకు రమ్మన్నాడు. డానీష్‌ అక్కడికి వెళ్లే సరికి అక్కడ రౌడీషీటర్‌ కుమారుడితోపాటు మరో ఎనిమిది మంది మిత్రులున్నారు. కొంతసేపు గంజాయి తాగారు. సిద్ధంగా ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో మిత్రులందరూ కలిసి  డానీష్‌ తలపై దాడి చేశారు.డానీష్‌ గొంతుపిసికి ప్రాణాలు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేశారు. ఘటన ప్రదేశంలోనే అతని చరవాణి సిగ్నల్‌ చూపించడం వంటి ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఐదుగురిని కోర్టులో హాజరుపరిచారు.మరోఐదుగురిని జువైనల్‌ హోంకు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని