logo

Cyber Crime: గృహిణికి భర్త ఏడుపు వినిపించిన సైబర్‌ నేరస్థులు.. వీడియో కాల్‌ కట్‌ చేసి..

నగరానికి చెందిన ఓ గృహిణికి మంగళవారం సైబర్‌ నేరస్థుల నుంచి వీడియో కాల్‌ వచ్చింది. తెలిసినవారనుకొని కాల్‌ లిఫ్ట్‌ చేసింది.

Updated : 26 Jun 2024 13:30 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: నగరానికి చెందిన ఓ గృహిణికి మంగళవారం సైబర్‌ నేరస్థుల నుంచి వీడియో కాల్‌ వచ్చింది. తెలిసినవారనుకొని కాల్‌ లిఫ్ట్‌ చేసింది. ఇక అంతే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు.ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాము సీబీఐ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్‌ కేసులో ‘నాన్‌-బెయిల్‌ వారెంట్‌’పై అరెస్టు చేశామన్నారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా.. ఇంటికి పంపించాలన్నా.. వెంటనే రూ.50 వేలు తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని హుకుం జారీ చేశారు. పోలీసు సిబ్బంది వారిపై లాఠీలతో దాడి చేస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారో వినండి.. అంటూ ఏడ్పులు వినిపించారు. దాంతో ఆమె నిజమేననుకొని వణికిపోయింది. తమవారితో సంప్రదిస్తానని ఆమె చెబితే.. వీడియోకాల్‌ కట్‌ చేస్తే మీ వాళ్లు ఇంటికి కాదు.. నేరుగా జైలుకెళ్తారని.. నేరస్థులు బెదిరించారు. డబ్బుల కోసం తొందరపెడుతూ.. మానసికంగా వేధించారు. ఓ సందర్భంలో ఆమె డబ్బులు పంపిద్దామనే నిర్ణయానికి కూడా వచ్చారు. కానీ ధైర్యం చేసి ఆ వీడియో కాల్‌ కట్‌ చేసింది. వెంటనే తన భర్తకు ఫోన్‌ చేయగా.. ఆయన స్వరం విని ఊపిరి పీల్చుకుంది. జరిగిందంతా చెప్పారు. ఇంటికి వెళ్లిన ఆయన ఆమెకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని