logo

Andhra news: కటకటాల్లో అన్న.. తమ్ముడెక్కడ?.. పిన్నెల్లి అరెస్టుతో పల్నాట చర్చ

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు, ఆపై జైలుకు తరలించడంతో ఇప్పుడు అందరి దృష్టి పరారీలో ఉన్న తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై పడింది. కేసులు నమోదైన నేపథ్యంలో అన్నతో పాటు తొలుత మాచర్ల నుంచి హైదరాబాద్‌కు వెంకట్రామిరెడ్డి వెళ్లారు.

Updated : 28 Jun 2024 09:45 IST

ఇంకా తెలియని వెంకట్రామిరెడ్డి జాడ
ఈనాడు డిజిటల్, నరసరావుపేట

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు, ఆపై జైలుకు తరలించడంతో ఇప్పుడు అందరి దృష్టి పరారీలో ఉన్న తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై పడింది. కేసులు నమోదైన నేపథ్యంలో అన్నతో పాటు తొలుత మాచర్ల నుంచి హైదరాబాద్‌కు వెంకట్రామిరెడ్డి వెళ్లారు. అక్కడి నుంచి అన్నదమ్ములిద్దరూ పరారయ్యారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం.. జూన్‌ 6 వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ముందస్తు ఉత్తర్వులు జారీ చేయడంతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ తమ్ముడు మాత్రం మే 22 నుంచి కనిపించడం లేదు.

మాచర్లలో అన్న రామకృష్ణారెడ్డి కంటే తమ్ముడు వెంకట్రామిరెడ్డినే నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. అన్నింటా ఆధిపత్యం చలాయించేవారు. అప్పట్లో ‘షాడో ఎమ్మెల్యే’ మాదిరి పనులు చక్కబెట్టేవాడు. పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లలో అన్న రెంటచింతల, మాచర్ల మండలాల్లో జరిగిన దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే.. తమ్ముడు మాచర్ల పట్టణం, వెలుర్తి మండలాల్లో జరిగిన దాడుల్లో పాల్గొని దొరికినవారిని దొరికినట్టు దాడులకు తెగబడ్డారు. ఎటువంటి పదవి లేకపోయినా.. ప్రజాప్రతినిధి కాకపోయినా సరే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి పోలీసులు సలాం కొట్టేవారు. పల్నాడుతో అనుబంధం ఉన్న ఒక ఐపీఎస్‌ కనుసన్నల్లోనే వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ జాడ తెలియలేదు. తురకా కిశోర్‌కు వాటా ఇవ్వకపోవడంతో నా వ్యాపార్ని మూయించాడు. ఇప్పుడు వాళ్లకు కూడా శిక్ష పడాల్సిందేనంటూ కొందరు మాచర్ల వ్యాపారులు సామాజిక మాధ్యమాల వేదికగా గళం విప్పుతున్నారు.

గురజాల డీఎస్పీగా పని చేస్తున్న శ్రీనివాసరావు పిన్నెల్లి సోదరుల కేసులు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌ మంచి పేరున్న శ్రీనివాసరావు ఎలాగైనా వెంకట్రామిరెడ్డిని పట్టుకుంటారని చెబుతున్నారు. పరారీలో ఉన్న వెంకట్రామిరెడ్డి, తురక కిశోర్‌ను పట్టుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 బాణసంచా వెలుగులు

బాణసంచా కాల్చిన మాచర్ల వాసులు

మాచర్ల(వెల్దుర్తి). న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడిని పోలీసులు బుధవారం మాచర్ల కోర్టుకు తీసుకువచ్చారు. అదే సమయంలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేసుకున్నారు. మాచర్లకు పట్టిన శని పూర్తిస్థాయిలో అంతమైందని నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు