logo

Telugu States: త్వరలో రాజధానుల మధ్య రయ్‌రయ్‌!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి.

Published : 03 Jul 2024 05:08 IST

పట్టాలెక్కిన నల్లపాడు-బీబీనగర్‌ ప్రాజెక్టు
తొలి దశలో రూ.570 కోట్లతో రెండో రైల్వే లైను పనులు
గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే

నల్లపాడు - బీబీనగర్‌ మార్గం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్‌(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. కుక్కడం-నడికుడి మధ్య 47 కి.మీ పనులు చేపట్టేందుకు ఇటీవలే గుత్తేదారుడ్ని ఎంపిక చేశారు. ఈ పనులకు రూ.570 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

మొత్తం నాలుగు దశల్లో..: నల్లపాడు-బీబీనగర్‌ మధ్య 248 కి.మీ లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరించనుంది. ఈ మార్గం మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేయాలని కన్‌స్ట్రక్షన్‌ విభాగం అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.  తొలి దశలో కుక్కడం-నడికుడి పనులకు ఇప్పటికే కాంట్రాక్టరును ఎంపిక చేశారు. రెండో దశలో కుక్కడం-వలిగొండ పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులు ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. మూడు, నాలుగు దశల పనులు తర్వాత చేపట్టనున్నారు. రెండో రైల్వే లైను నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో ఏపీ పరిధిలో 135 హెక్టార్లు.. మిగిలింది తెలంగాణలో ఉంది. భూసేకరణ అవసరం లేని చోట పనులకు ముందుగా టెండర్లు పిలుస్తున్నారు.

ఈ మార్గంలో సింగిల్‌ లైను

సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌ వరకు రెండులైన్ల రైలు మార్గం ఉంది. ఆ తర్వాత పగిడిపల్లి స్టేషన్‌ నుంచి నల్గొండ-మిర్యాలగూడ.. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లపాడు వరకు ఒక లైను మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో ఒక రైలు వస్తుంటే మరో బండిని స్టేషన్లో ఆపాల్సి వస్తోంది. ట్రాక్‌ సామర్థ్యంతో పోలిస్తే 140 శాతం రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో లైను నిర్మాణానికి సంబంధించిన సర్వే నివేదికను రైల్వే బోర్డు పరిశీలించి ఆమోదించింది. మొత్తం 248 కి.మీ లైనుకు రూ.2,853 కోట్లు అవసరమని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. దీనికి కేంద్ర కేబినెట్‌ కమిటీ నిరుడే ఆమోదముద్ర వేసింది. రద్దీ మార్గం కావడంతో రైల్వే బోర్డు అధికారులు ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సానుకూలంగా ఉన్నారు.

మూడు గంటల్లోనే సికింద్రాబాద్‌కు : పనులు పూర్తయితే రైలులో గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాల   రాజధానుల మధ్య రాకపోకలు సులువు కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని