logo

జలవనరులకు జవసత్వాలు

ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి.

Published : 04 Jul 2024 04:36 IST

రూ.1.85 కోట్లతో చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు
యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి కసరత్తు
ఈనాడు, అమరావతి

దేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి. గతంలో భారీ వర్షాలకు కట్టలు తెగిపోయాయి. అలుగులు కోతకు గురయ్యాయి. షట్టర్లు తుప్పుపట్టిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలవనరుల ప్రాధాన్యతను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసింది. చిన్ననీటి పారుదలశాఖ ఇంజినీర్లు రూ.1.85కోట్ల అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. చెరువుల నుంచి నీరుపారే అలుగులు, స్లూయిజ్‌లు, తూములు, షట్టర్లు మరమ్మతు చేయనున్నారు. అదేవిధంగా బలహీనంగా ఉన్న కట్టలను బలోపేతం చేయనున్నారు. జులై నెలలోనే మరమ్మతులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందులో అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపాదనలు పంపారు. 

వర్షపు నీటిని ఒడిసిపట్టి..

వర్షం ద్వారా వచ్చే నీరు వృథాగా వాగుల్లోకి పోకుండా చెరువులకు చేరేలా చూస్తారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి చెరువుల్లో నిల్వచేసేలా అంచనాలు సిద్ధం చేశారు. చెరువులకు చేరిన నీరు లీకేజీల ద్వారా వృథా కాకుండా మరమ్మతు ద్వారా అరికడతారు. సప్లయి ఛానళ్లను బాగు చేసి ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ముప్పాళ్ల, సత్తెనపల్లి, ఈపూరు, శ్యావల్యాపురం, గురజాల, రెంటచింతల, దుర్గి, తాడేపల్లి, యడ్లపాడు, నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల్లో 19 చెరువులు మరమ్మతు చేస్తారు. ఇందుకు రూ.1.85కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలపై ఈనెల 5న ఉన్నతాధికారులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే స్వల్పకాలిక టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించి పూర్తి చేస్తారు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున వీలైనంత తొందరగా బాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కొన్ని చెరువులకు వర్షాల ద్వారా నీరు చేరుతుండగా.. మరికొన్నింటకి సాగర్‌ కాలువల నుంచి నీరు చేరే వెసులుబాటు ఉంది. వీటి కింద వేల ఎకరాల్లో ఆయకట్టుకు కొన్నాళ్లుగా సాగునీరు అందని పరిస్థితి. వీటన్నిటిని బాగు చేస్తే పంటలకు సాగు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. చెరువులో నీటిని నిల్వ చేస్తే చేపల పెంపకానికి కూడా ఉపయోగపడతాయి. దీంతో ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చిన్ననీటి పారుదలశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్‌ తెలిపారు. తొలుత రూ.10కోట్లతో అంచనాలు తయారు చేశామన్నారు. అత్యవసర పనులకు మాత్రమే అంచనాలు పంపాలని కోరడంతో మరోసారి క్షేత్రస్థాయి ఇంజినీర్లతో సమీక్షించి తాజాగా రూ.1.85కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని