logo

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Updated : 04 Jul 2024 04:44 IST

పోలీసుల దర్యాప్తు ముమ్మరం
కొత్తగా 27 మంది గుర్తింపు
ఈనాడు, అమరావతి

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. 2021 అక్టోబరు 19న వైకాపా అల్లరిమూకలు మారణాయుధాలు, రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసిన విషయం తెల్సిందే. దాడిలో కార్యాలయ సిబ్బందితో పాటు తెదేపా నాయకులు పలువురికి రక్తగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వైద్య నివేదికను సేకరించిన పోలీసులు దర్యాప్తులో భాగంగా చేసుకున్నారు. కార్యాలయంలో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కూడా చోరీ చేశారు. పి.సాయిబద్రీనాథ్‌ ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో వైకాపా అధికారంలో ఉండడంతో పోలీసులు కేసును పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం, అప్పట్లో ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ స్థానంలో తుషార్‌డూడీ రావడం, ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వచ్చిన తర్వాత కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో తీసుకున్న సీసీ టీవీ ఫుటేజీలతో పాటు 8మంది సాక్షులను విచారించి వారిచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తులో పోలీసులు మరికొన్ని సెక్షన్లు నమోదు చేశారు. 8 మంది సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, బాధితుడు సాయిబద్రీనాథ్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితులను నిర్ధారించుకున్నారు. వీటితో పాటు కాజా టోల్‌ప్లాజా వద్ద సీసీ ఫుటేజీ సేకరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దాడి రోజు వినియోగించిన వాహనాలు, నిందితుల కదలికలు, టోల్‌ప్లాజా వద్ద తీసుకున్న సీసీటీవీ ఫుటేజీ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. మరికొందరు నిందితులను గుర్తించడానికి నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

కొత్తగా చేర్చిన పేర్లు ఇవే..

లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా ఎమ్మెల్సీ (గుంటూరు), దేవినేని అవినాష్‌ (విజయవాడ), అంబేడ్కర్, కార్పొరేటర్‌ (విజయవాడ), అరవ సత్యం (విజయవాడ నగరపాలక సంస్థ వైకాపా ఫ్లోర్‌ లీడర్‌), అచ్చాల వెంకటరెడ్డి (30వ డివిజన్‌ కార్పొరేటర్‌) (గుంటూరు), బత్తుల దేవానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ (గుంటూరు), బొచ్చు మురళి, చల్లా శీను, చల్లా వెంకటస్వామి (విజయవాడ), గేదెల రమేష్, 22వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ భర్త (గుంటూరు), గిరిరాము (గుంటూరు), గోకమళ్ల ప్రసాద్, కసగాని దుర్గారావు (విజయవాడ), ఖాజా మెహిద్దీన్‌ (గుంటూరు), కొండ్ర కొండ ఆటోడ్రైవర్‌ (విజయవాడ), కృష్ణారెడ్డి (గుంటూరు మిర్చియార్డు మాజీ డైరెక్టర్‌), మద్దెల సాయి (విజయవాడ), మార్కెట్‌బాబు, నూనె ఉమామహేశ్వరరెడ్డి (గుంటూరు), పంతల సాయి, పోపల రాజా (విజయవాడ), రబ్బాని(ఏఆర్‌రబ్బానీ) లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు (గుంటూరు), సాదు రాజేష్, 23వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ భర్త (గుంటూరు), సంతోష్‌ డీజే ఆపరేటర్‌ (విజయవాడ), షేక్‌ రోషన్‌(కార్పొరేషన్‌ రోషన్‌) (గుంటూరు), సిరాజ్‌ (విజయవాడ), స్టార్‌ మస్తాన్‌ టైర్‌ డిపో (గుంటూరు)కు చెందినవారిగా గుర్తించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని