logo

విత్తన లోపం.. రైతుకు శాపం

2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి.

Published : 04 Jul 2024 04:31 IST

వరిలో కేళీలతో కష్టాలు
ఏటా బయటపడుతుండడంతో నష్టాలు 
ఈనాడు-అమరావతి

2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి. పంట 100 రోజుల దశ దాటిన తర్వాత ఈనే దశలో విత్తన లోపాలు బహిర్గతమవుతున్నాయి. రైతులు కేళీలను గుర్తించి సంబంధిత కంపెనీ ప్రతినిధులకు సమాచారమిస్తే అరకొరగా పరిహారం ఇచ్చి సర్దుబాటు చేసుకుంటున్నారు. రైతుల వద్ద బిల్లులు లేకపోవడం, వ్యాపారులు విత్తనాలు విక్రయించే సమయంలో షరతులు విధించడంతో రైతులకు కొన్నిసార్లు నష్టపరిహారం అందడం లేదు. ఈ ఏడాది కూడా రెండు రోజుల వ్యవధిలో పొన్నూరు నియోజకవర్గంలో రెండు లారీల వరి విత్తనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు కొనుగోలు చేసి తీసుకువచ్చారు. వరి సాగుదారులకు ప్రభుత్వం నుంచి విత్తనాల సరఫరా లేకపోవడంతో పూర్తిగా ప్రైవేటు కంపెనీల విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల ఏటా సమస్యలు వచ్చి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈసారి విత్తన కొరత ఎక్కువగా ఉండటంతో కేళీల సమస్య ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

రాయలసీమ, తెలంగాణ నుంచి సరఫరా

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 లక్షల హెక్టార్లకుపైగా వరి పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సింహభాగం బీపీటీ-5204 రకం వరి విత్తనాన్ని రైతులు సాగు చేస్తారు. స్థానికంగా విత్తన లభ్యత లేకపోవడంతో రాయలసీమలోని నంద్యాల, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి ఇక్కడి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఆయా పట్టణాల కేంద్రంగా ఉన్న వరి విత్తన కంపెనీల నుంచి కొనుగోలు చేసి రైతులు ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. జిల్లాలోని వ్యాపారులు సైతం అక్కడి కంపెనీల నుంచి తెప్పించి ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా పశ్చిమ డెల్టాలో రైతులు వరి సాగుకు సిద్ధం కావడంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి వరి విత్తనాలు తెప్పిస్తున్నారు. డెల్టాలో ఒక్కొక్క గ్రామానికి చెందిన రైతులు బృందంగా ఏర్పడి ఎన్ని బస్తాలు కావాలో లెక్కించుకుని ఇద్దరు లేదా ముగ్గురు రైతులు తెలంగాణ, రాయలసీమ ప్రాంతానికి వెళ్లి వరి విత్తనాలు కొనుగోలు చేసి తెస్తున్నారు. బిల్లులు మొత్తం ఇద్దరు లేదా ముగ్గురు రైతుల పేర్లతో తీసుకొచ్చి ఇక్కడ గ్రామాల్లో విత్తనాలు పంపిణీ చేసుకుంటున్నారు. ఇది కొన్నేళ్లుగా సాగుతున్న ప్రక్రియ. అయితే ఇటీవల కాలంలో వరుసగా వరి విత్తనాల్లో కేళీలు వస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 


కర్షకులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..

  • విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు గుర్తింపు పొందిన కంపెనీలనే ఎంపిక చేసుకోవాలి. 
  • నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ ప్రయోగశాలలో వరి విత్తనాలు పరీక్షించుకుని నాణ్యత నిర్దారించుకోవచ్చు. ఇతర రకాలు కలిశాయో కూడా పరీక్షించుకోవచ్చు.
  • లాంఫామ్‌లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన ధ్రువీకరణ సంస్థ ప్రయోగశాలలోనూ పరీక్షించుకునే వెసులుబాటు ఉంది. 
  • విత్తన కొనుగోలు సమయంలో బిల్లు తీసుకుని పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలి. 

ప్రైవేటు వ్యాపారులే ఆధారం..

మ్మడి గుంటూరు జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో వరి సాగు చేసి కొంత మొత్తంలో విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నారు. ఇవి కాకుండా ఏపీ సీడ్స్‌ ఆధ్వర్యంలో విత్తనాలు సేకరించి రైతులకు సరఫరా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిల్లాలో వరి సాగు చేసే పది శాతం విస్తీర్ణానికి మాత్రమే సరిపోతాయి. 90 శాతం విస్తీర్ణానికి రైతులు ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. వరి విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు తెలంగాణ, రాయలసీమలో ఉండటంతో అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. ఏదైనా విత్తన సమస్యలు వస్తే రాయలసీమ, తెలంగాణ కేంద్రంగా కంపెనీలు ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లి పరిష్కరించుకోలేకపోతున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి రైతులు ఆసక్తిచూపడం లేదు. స్థానిక వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తే శాస్త్రవేత్తలను పంపి కేళీలు ఎంత శాతం ఉన్నాయి? ఎకరాకు ఎన్ని బస్తాల దిగుబడి నష్టపోయారు? వంటి వివరాలతో నివేదిక ఇస్తున్నారు. దీని ఆధారంగా కంపెనీపై కేసులు వేసి పరిహారం పొందే వెసులుబాటు ఉంది. రైతులు పోరాడలేక కంపెనీలతో ప్రైవేటు ఒప్పందాలు చేసుకుని నామమాత్ర పరిహారంతో సరిపెట్టుకున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విత్తన నమూనాల సేకరణ, తనిఖీలు విస్తృతం చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని