logo

సైకో కిల్లర్‌కు జీవిత ఖైదు

అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్‌ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్‌కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్‌ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు.

Published : 04 Jul 2024 04:26 IST

పసి పిల్లలపై దారుణానికి పాల్పడి హతమార్చాడు 
గుంటూరు పోక్సో కోర్టు తీర్పు

గుంటూరు లీగల్‌ న్యూస్‌టుడే: అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్‌ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్‌కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్‌ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. తాడేపల్లి మండలం మల్లెంపూడికి చెందిన మల్లెంపూడి గోపి (19) దుర్వ్యసనాలు, మత్తు మందులకు అలవాటుపడి మగ పసిపిల్లలపై అసహజ లైంగిక దాడికి పాల్పడేవాడు. 2021 మార్చి 14న అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసి సమీపంలోని తోటలోకి తీసుకెళ్లాడు. ఆ బాలుడు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు తాడేపల్లి పొలీసులకు ఫిర్యాదుచేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. తరవాత రోజు జామ తోట వద్ద చెప్పులు గుర్తించి వెతకగా అక్కడే కొద్ది దూరంలో బాలుడు శవమై పడిఉన్నాడు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు బాలుడి మృతిని అనుమానాస్పద కేసుగా మార్చి శవ పరీక్ష నిర్వహించగా దారుణమైన విషయాలు డాక్టర్ల నివేదకలో వెల్లడయ్యాయి. బాలుడితో అసహజ శృంగారం నిర్వహించడంతోపాటు కాళ్లు, చేతులు విరిచేసి హతమార్చినట్లు తేలింది. హత్య కేసుగా నమోదు చేసిన పొలీసులు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. వారి దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన నిందితుడు గోపి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించడంతో అతను వీఆర్‌వో ద్వారా పొలీసులకు లొంగిపోయి ఈ దారుణానికి తానే పాల్పడినట్లు అంగీకరించాడు. ప్రాసిక్యూషన్‌ నేరం రుజువు చేయటంతో నిందితుడు గోపికి జీవిత ఖైదు, రూ.62 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సీఐడీ డీఎస్పీ జయసూర్య కేసు దర్యాప్తు నిర్వహించగా పీపీ జి.శివప్రసాద్‌రెడ్డి ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. 

కొనసాగుతున్న విచారణ.. 

పోలీసుల విచారణలో ఈ సంఘటనకు నెల రోజుల ముందు వడ్డేశ్వరం వద్ద నిందితుడు గోపి మరో బాలుడిపై ఇదే విధమైన నేరానికి పాల్పడి హతమార్చాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని