logo

నేనూ సాధారణ విద్యార్థినే..

విద్యార్థి దశలో అత్తెసరు మార్కులే వచ్చేవి. పాఠశాలలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయా. కళాశాల నుంచి కూడా సాధారణ విద్యార్థిగానే బయటకొచ్చా. మా దగ్గరి బంధువు వ్యవసాయ శాస్త్రవేత్త.

Published : 04 Jul 2024 04:25 IST

కష్టపడి ఐపీఎస్‌కు ఎంపికయ్యా
శిక్షణ అధికారి మనోజ్‌ హెగ్డే
న్యూస్‌టుడే - గుంటూరు వైద్యం

విద్యార్థి దశలో అత్తెసరు మార్కులే వచ్చేవి. పాఠశాలలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయా. కళాశాల నుంచి కూడా సాధారణ విద్యార్థిగానే బయటకొచ్చా. మా దగ్గరి బంధువు వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన చేస్తున్న సమాజ సేవను స్ఫూర్తిగా తీసుకుని సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధం కావాలని నిర్ణయించుకుని, బాగా శ్రమించి ఐపీఎస్‌కు ఎంపికయ్యానని చెప్పారు మనోజ్‌ హెగ్డే.

ర్ణాటకకు చెందిన ఈయన 2021 సివిల్స్‌లో 213వ ర్యాంకు సాధించారు. తుది విడత శిక్షణలో భాగంగా ప్రస్తుతం గుంటూరులో ఉన్న ఆయన ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా  మాట్లాడారు. 
‘డిగ్రీ చదువుకునే రోజుల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధికారుల గురించి పత్రికలు, పుస్తకాల్లో చదివా. అఖిల భారత సర్వీసులకు ఎంపికైతే సమాజసేవ చేయవచ్చనే ఆలోచనతో 2016లో తొలిసారి సివిల్స్‌కు సన్నద్ధమై ఇంటర్య్వూకి అర్హత సాధించా. మార్కులు తక్కువగా రావడంతో ఏ పోస్టుకూ ఎంపిక కాలేదు. 2017లోనూ మౌఖిక పరీక్షకు ఎంపికైనప్పటికీ ఫలితం దక్కలేదు. 2018లో కనీసం ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయా. తీవ్ర నిరాశ చెందా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిత్రుల మద్దతులో 2019లో పరీక్షకు హాజరై.. తిరిగి మౌఖిక పరీక్షకు అర్హత సాధించా. ఫలితం రాలేదు. పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం 2020లో విరామం తీసుకున్నా. సర్వశక్తులు ఒడ్డి 2021లో పరీక్షకు హాజరుకాగా 213 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యా. ఉత్తమ ర్యాంకు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించారు. ఆగస్టు 30 వరకు శిక్షణ ఉంటుంది. తర్వాత పోస్టింగ్‌ ఇవ్వనున్నారు’. 

ఎన్నో ఒడుదొడుకులు 

మాది ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ పట్టణం. నాన్న రామనాథ్‌ హెగ్డే పశు సంవర్ధక శాఖలో సాధారణ ఉద్యోగి. ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. తల్లి గీత హెగ్డే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. చెల్లెలు మానస హెగ్డే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అధికారి. మధ్యతరగతి కుటుంబం. సుదీర్ఘకాలం పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి రావడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేటు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పని చేశా. దీనివల్ల కుటుంబంపై ఆర్థిక భారం తప్పడమే కాకుండా పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు వీలైంది. 

ఆటలపైనే ప్రశ్నలు 

థామస్‌ కప్‌ పోటీలను టీవీలో బాగా చూశా. మరుసటి రోజే ఇంటర్వ్యూ. ఈ క్రీడపైనే దాదాపు 40 శాతం ప్రశ్నలు అడిగారు. బ్యాడ్మింటన్, వాలీబాల్‌ రెండూ ఎంతో ఇష్టం. ఖాళీ ఉంటే ఆడుతుంటా. వంట చేయడమంటే మహా ఇష్టం.  

సీనియర్లు, మెంటార్ల సలహాలు తీసుకున్నా

రోజుకు ఎన్ని గంటలు చదివామన్నది కాదు.. ఎంత శ్రద్ధతో అర్థం చేసుకున్నామన్నదే ముఖ్యం. పరీక్షలో ఎంత బాగా రాయగలిగాం అన్నదే కీలకం. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలనే ప్రామాణికంగా తీసుకున్నా. ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించే మెటీరియల్‌ని ఉపయోగించుకున్నా. మన బలం, బలహీనతలు గుర్తెరిగి పరీక్షకు సిద్ధం కావాలి. ఈ పరీక్షకు హాజరయ్యేవారు రెండు, మూడుసార్లు ప్రయత్నం తర్వాత విజయం సాధించకపోతే ఏదైనా ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగం చేస్తూ కూడా సిద్ధం కావడం మంచిది. అనుభవం ఉన్న మెంటార్ల సూచనలు, సలహాలు చాలా అవసరం. వారితో తరచుగా చర్చిస్తూ ఉండాలి. పెద్దపెద్ద కోచింగ్‌ సెంటర్లకు వెళ్లలేదు. సొంతంగానే సన్నద్ధమయ్యా. 

మాతృభాషపై మమకారం 

మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. కన్నడ సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. కన్నడ నవలలు బాగా చదివి భాషపై పట్టు సాధించా. దీనివల్లే హిందీ, తెలుగు భాషలను సులభంగా నేర్చుకున్నా. కన్నడ మాధ్యమంలోనే ఆరో తరగతి వరకు చదువుకున్నా. ధార్వాడ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ పూర్తి చేశా. 

21 సార్లు రక్తదానం

ఇప్పటికే 21 సార్లు రక్తదానం చేశా. ఎక్కడా ఉత్పత్తి చేయలేని, ప్రత్యామ్నాయమంటూ లేని రక్తంలోని విభజిత రూపాలన్నీ బాధితుల్ని ఆదుకుంటాయనే నమ్మకం. అందుకే ఇంటర్మీడియట్‌ నుంచే రక్తదానం చేయడం అలవాటుగా పెట్టుకున్నా. 

విజయం కోసం నిరీక్షించాల్సిందే 

ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైతే సుదీర్ఘకాలం నిరీక్షించాల్సిందే. ఏదైనా పని ఒకసారి మొదలుపెడితే దాన్ని పూర్తి చేసేవరకు ఆగకూడదు. ఏ వ్యాపకంలోనైనా క్రమశిక్షణ ముఖ్యం. మంచి ఎక్కడ కనిపించినా తీసుకుంటాను.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని