logo

పేదల బియ్యాన్ని బొక్కేశారు

పేదల బియ్యాన్ని వైకాపా రేషన్‌ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్‌లైన్‌లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.

Published : 04 Jul 2024 04:11 IST

చోద్యం చూసిన యంత్రాంగం
మాచవరం, న్యూస్‌టుడే 

పేదల బియ్యాన్ని వైకాపా రేషన్‌ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్‌లైన్‌లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. గత ఐదేళ్లు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం మారి దుకాణాల నిర్వహణ చేతులు మారడంతో ఈ తతంగం వెలుగు చూసింది. అయినా గత డీలర్లు జంకుబొంకు లేకుండా వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం నిల్వలు తీసుకురమ్మని కోరుతున్నా లెక్కపెట్టడం లేదు. పైగా 6ఏ కేసు నమోదు చేసుకోవాలని బరితెగించి మాట్లాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వ సొమ్ము పరులపాలైందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మండలంలో పరిస్థితి ఇదీ..

మండలంలో 37 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,481 కార్డుదారులు, 49,423 సభ్యులు ఉన్నారు. ప్రతినెలా ప్రభుత్వం వీరికి బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు అందిస్తోంది. అప్పుడప్పుడు గోధుమ పండి సరఫరా చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక, చౌక దుకాణాలన్నీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోకి వెళ్లాయి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నా, పిన్నెల్లి, గంగిరెడ్డిపాలెం, మాచవరంతోపాటు మరికొన్ని గ్రామాల్లో ముందుగానే బియ్యం అమ్ముకుని కార్డుదారులకు ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పేవారు. అలా ఐదేళ్లు గోదాములో పడ్డ ఎలుకల మాదిరిగా తినేశారు. విషయం రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసినా, ఏనాడు దుకాణాలు తనిఖీ చేసి చర్యలు తీసుకోలేదు. డీలర్లకు ఇష్టారాజ్యంగా మారింది. కందిపప్పు, పంచదార రాలేదని బియ్యంతోపాటు కార్డుదారులతో వేలిముద్ర వేయించుకుని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో దుకాణాల నిర్వహణ మారింది. కొత్తవారు బాధ్యతలు తీసుకునే ముందు నిల్వలు చూస్తే, పెద్ద ఎత్తున అవినీతి బాగోతం బయట పడింది. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

ఆన్‌లైన్‌లోనే నిల్వలు..

రెవెన్యూ అధికారులు జూన్‌ నెలాఖరున నిల్వలు పరిశీలించినప్పుడు కళ్లు చెదిరే విషయాలు వెలుగు చూశాయి. 
గంగిరెడ్డిపాలెంలోని రేషన్‌ దుకాణాన్ని పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌లో 120.35 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉంటే, క్షేత్ర స్థాయిలో 15 క్వింటాళ్లు మాత్రమే దర్శనమిచ్చాయి. 105.35 క్వింటాళ్లు పక్కదారి పట్టాయి. ఇక్కడ డ్వాక్రా సంఘం ముసుగులో నిర్వహణ చూస్తున్న యువకుడిని అడిగితే, 6ఏ కేసు నమోదు చేసుకోమని చెప్పాడని అధికారులు వాపోయారు. 

మాచవరం

దుకాణం నెంబరు 32లో 36.60 క్వింటాళ్లు ఉండాల్సి ఉండగా.. అసలు బియ్యపు గింజ కూడా కనిపించలేదు. వేమవరంలోని ఓ దుకాణంలో 41.16 క్వింటాళ్ల 0.40 క్వింటాళ్లు మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 40.76 క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయి. 

కొత్తగణేశునిపాడు

8.85 క్వింటాళ్ల వ్యత్యాసం కనిపించింది. ఇక పిన్నెల్లి గ్రామంలో ఎన్ని పక్కదారి పట్టాయో అధికారులు నోరుమెదపడం లేదు. 


దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దారు శ్రీరామకృష్ణను వివరణ అడగ్గా.. ఆర్‌ఐ ద్వారా నివేదిక తెప్పించాం.. వివరాలన్నీ ఆర్డీవో, పౌరసరఫరాల అధికారుల దృష్టికి తీసుకెళతాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని