logo

ఓట్ల తొలగింపు కథ కంచికేనా..!

జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Updated : 03 Jul 2024 04:59 IST

పర్చూరులో తప్పుడు ఫారం-7లపై కేసులతో సరి
బాధ్యులైన వైకాపా నాయకులు, కార్యకర్తలపై చర్యలేవి?
ఈనాడు-బాపట్ల

జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో తెదేపా, ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం-7 దరఖాస్తులు చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలకు పోలీసులు మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారినా పోలీసుల తీరు మారలేదు. కనీసం ఇప్పుడైనా ఆ తప్పుడు దరఖాస్తులు చేసిన బాధ్యులైన వైకాపా నాయకులు, కార్యకర్తలపై ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌-32 కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారేమోనని ప్రజలు ఆశించారు. కానీ పోలీసులు నాటి కేసుల దర్యాప్తు నత్తనడకన సాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా పోలీసులు ఆ కేసుల జోలికి వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వాటిని కాలగర్భంలో కలిపేసే యోచనలో ఉన్నారేమోనని బాధిత ఓటర్లతోపాటు నియోజకవర్గ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఓట్లను తొలగించకుండా ఉండేందుకు అనేక స్థాయిల్లో పోరాటాలు చేసి ఒక్క అర్హత కలిగిన ఓటు పోకుండా స్థానిక తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎంతో పోరాడారు. కనీసం అధికారం మారాక అయినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

22 కేసులతో సరిపుచ్చారు

పర్చూరు, యద్ధనపూడి, కారంచేడు, మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం మండలాల నుంచి మొత్తం 23 వేల దరఖాస్తులు ఓట్లు తొలగింపు కోరుతూ అందాయి. అయితే అందులో అర్హుల ఓట్లే ఎక్కువగా ఉన్నాయని విచారణలో తేల్చారు. తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా మండలాల తహసీల్దార్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు కట్టి విచారణను పక్కనపెట్టారు. 22 కేసులు నమోదు చేసి అందులో 55 మంది వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకుని వదిలేశారు. అయితే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌-32 కింద మూడు, ఆరు మాసాలకు తగ్గకుండా జైలు శిక్షలు విధించాలని ఉన్నా వీరంతా అధికార వైకాపాకు చెందినవారు కావడంతో నాడు పోలీసులు నోరు మెదపలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి మమ అనిపించారు.

200 మందికి పైగా భాగస్వామ్యం

దరఖాస్తులు చేసిన వారు సుమారు 200 మందికి పైగా ఉంటే నాడు అధికార పార్టీ ముఖ్య నేతలు అడ్డుకోవడంతో కేవలం 55 మందిపై మాత్రమే కేసులు నమోదయ్యాయి. కనీసం ఇప్పుడైనా మిగిలిన వారిపై కేసులు పెట్టి వారందరిపై చర్యలు తీసుకోవాలని కూటమి నాయకులు కోరుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై గతంలో ఎలాగైతే వేటు పడిందో అలానే దరఖాస్తులు పెట్టిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేవరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెబుతున్నారు. ఈ మధ్య పోలీసు అధికారులే ఆ కేసులపై పురోగతి తెలియజేశారు. వేగవంతం చేయాలని చెప్పాం. అయితే ఆశించిన స్థాయిలో వారు పని చేయడం లేదు. దీనిపై ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేస్తానని చెప్పారు. గతంలో ఈ వ్యవహారంలో వేటు పడిన పోలీసు అధికారులు కొందరు తిరిగి పోస్టింగ్‌ల కోసం ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే పోలీసు అధికారులే స్వయంగా ఓటర్ల జాబితాపై వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం చాలా తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. వారికి పోస్టింగ్‌లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా వారికి పోస్టింగ్‌లు ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని తిరిగి ఎన్నికల సంఘాన్ని, హైకోర్టును ఆశ్రయించి వాటిపై పునర్విచారణ కోరతానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని