logo

మట్టిని మింగిన ఘనులు

అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది.

Published : 03 Jul 2024 04:38 IST

జగనన్న కాలనీలో నేతల అక్రమ తవ్వకాలు
ఈనాడు - అమరావతి

అడిగేవారు లేరని... అడ్డుకునేందుకు ఎవరూ రారని... పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. వారి కోసం కేటాయించిన స్థలంలో అడ్డగోలుగా మట్టి తవ్వేసి.. అందినకాడికి దండుకుంటోంది.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు పరిధిలో నాటి వైకాపా ప్రభుత్వం 334 ఎకరాలను కొనుగోలు చేసింది. ఎకరానికి రూ. 46 లక్షల చొప్పున మొత్తం రూ. 153.64 కోట్లు వెచ్చించింది. 15 వేలమందికిపైగా పేదలకు ప్లాట్లు కేటాయించింది. 2021 జనవరిలో అప్పటి ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. మౌలిక వసతులు కల్పించకపోవడంతో అవస్థల నడుమ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు మొగ్గు చూపలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలినవారు ఖాళీగా వదిలేశారు. పేదలకు పంచగా మిగిలిన సుమారు 50 ఎకరాల ఖాళీ భూమిని రెండో విడతలో ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో నాటి ఎమ్మెల్యే తనయుడి కన్ను పడింది. ఆయనతోపాటు మరికొందరు మట్టిదొంగల అవతారమెత్తారు. భారీగా తవ్వేసి గుంటూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. 25 అడుగులకుపైగా లోతుకు తవ్వేశారు. సుమారు 15 ఎకరాల్లో అత్యంత లోతుకు తవ్వేసి ఎందుకూ పనికిరాకుండా చేశారు. ఇప్పుడది నివాసయోగ్యంగా లేదు. సుమారు రూ. 5 కోట్లకుపైగా విలువైన మట్టిని రాత్రివేళల్లో తరలించి అమ్మేసుకున్నారు. ఇపుడా ప్రాంతం చెరువులా మారింది. నివాసయోగ్యంగా ఉంచాల్సిన ఆ ప్రాంతంలో మట్టి తవ్వేస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ తవ్వకాలు కాలనీలోని ప్లాట్లవైపు విస్తరిస్తోంది. ఈ ప్రాంతానికి రావాలంటే లబ్ధిదారులు భయపడే పరిస్థితి. స్థలాలన్నీ ఖాళీగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి జగనన్న కాలనీ చిట్టడవిలా తయారవుతోంది. రూ. కోట్ల ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన భూములను అక్రమార్కులు ఆదాయవనరుగా మార్చేసుకున్నారు.

అప్పుడు వైకాపా.. ఇప్పుడు తెదేపా

గుంటూరు జిల్లాలో ప్రభుత్వ రహదారులు, జగనన్న కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి బోయపాలెం, పేరేచర్ల, నారాకోడూరు క్వారీలలో లభించే కంకర, గ్రావెల్‌ను మాత్రమే ఉపయోగించాలనేది నిబంధన. ఇందుకు విరుద్ధంగా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని జగనన్న కాలనీలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ 25 అడుగుల తర్వాత కూడా గ్రావెల్‌ లభిస్తుండటంతో మరింత లోతుకు తవ్వేస్తున్నారు. గుంటూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వెంచర్లలో లోతట్టు ప్రాంతాలను మెరక చేయడానికి, ఇళ్ల స్థలాలు ఎత్తు చేసుకోవడానికి, పొలాల్లో ఎగుడుదిగుడులను సరిచేయడానికి ఈ మట్టిని తరలిస్తున్నారు. గుంటూరు నగరానికి అత్యంత సమీపంలోనే లభిస్తుండడంతో రాత్రివేళ పెద్దఎత్తున రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కొర్నెపాడు గ్రామానికి చెందిన కొందరు తెదేపా నేతలు సైతం మట్టి తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పక్ష నేతలు కావడంతో యంత్రాంగం కూడా పట్టించుకోకపోవడంతో వారికి మరింత లోతుకు తవ్వుతున్నారు. రెండురోజులుగా వర్షం పడి నీరు రావడంతో తవ్వకాలు ఆగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని