logo

సకుటుంబ సపరివార సమేతం!

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది.

Published : 03 Jul 2024 04:33 IST

ఏఎన్‌యూలో కొలువుల తీరిది
అడ్డగోలుగా నియామకాలు
ఈనాడు - అమరావతి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. విద్యార్హతలు, ప్రతిభను పక్కన పెట్టి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు, నాటి వైకాపా ప్రజాప్రతినిధుల సిఫారసులు ఉన్న వారినే అతిథి, ఒప్పంద అధ్యాపకులుగా నియమించారు. రెగ్యులర్‌ అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల్లో కొందరు తమ పిల్లలు, బంధువులకు కొలువులు ఇప్పించుకున్నారు. తాజాగా ప్రభుత్వం మారటంతో ఈ అడ్డగోలు నియామకాలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజా మాజీ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్‌ తన బంధువులను ఉద్యోగులుగా నియమించుకోవడం గమనార్హం. వీరికి వర్సిటీ ఆదాయాన్ని జీతాల రూపేణా భారీగా దోచిపెడుతున్నారు. అసలు వర్సిటీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చుకు పొంతనే లేకుండా ఉంది. గడచిన మూడు, నాలుగేళ్లలో జీతాలు, వేతనాల వ్యయం బాగా పెరిగిందని ఫైనాన్స్‌ అధికారులు చెబుతున్నారు. డిపాజిట్లను సైతం తీసి జీతాలకు చెల్లించాల్సి వస్తోందంటే నియామకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.

  •  వర్సిటీ సీడీసీ డీన్‌ ఆచార్య మధుబాబు తన తోడల్లుడిని ఇంజినీరింగ్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా నియమించటంలో కీలకపాత్ర పోషించారు.
  • దూరవిద్య డైరెక్టర్‌ ఆచార్య నాగరాజు తన కుటుంబీకులు, బంధువుల పిల్లలతోపాటు ఇతరులను తీసుకొచ్చి వివిధ పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారని బలమైన ఆరోపణలున్నాయి.తోడల్లుడు వసంతరావు ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ. మరో బంధువు అబ్రహం లింకన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రంలో అతిథి అధ్యాపకుడు. మేనకోడలు క్యాజువల్‌ లేబర్‌. తన వద్ద పని చేసే ఓ స్కాలర్‌కు ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా ఉద్యోగం ఇప్పించుకున్నారు.
  • వర్సిటీ ఇంజినీర్‌ కుమార్‌రాజా తనకు వరసకు కుమార్తె అయిన ఉషా కిరణ్‌ను ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అతిథిÅ     అధ్యాపకురాలిగా నియమింపజేశారు. ఆమెకు బోధనానుభవం అంతంతమే మాత్రమే.
  • వైకాపా నాయకుడు విజయబాబు కుమార్తె శృతికీర్తిని కొత్త కోర్సు అయిన ఫెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ విభాధిపతిగా నియమించారు.
  • ఇంజినీరింగ్‌ కళాశాల డీన్‌ ప్రొఫెసర్‌ సిద్ధయ్య కుమారుడు ఆర్వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కానీ అతని వద్ద ఇంజినీరింగ్‌ విద్యార్థులు పీహెచ్‌డీ చేసేలా పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ ఇప్పించుకున్నారని సమాచారం.
  • గత వీసీ రాజశేఖర్‌ వద్ద గతంలో స్కాలర్‌గా ఉన్న రాజ్‌కుమార్‌కు సోషియాలజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా అవకాశమిచ్చారు.
  • వర్సిటీ గ్రంథాలయంలో రోజువారీ వేతన ఉద్యోగిగా ఉన్న కొండలరావు దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేస్తే ఆయనను లైబ్రరీ సైన్స్‌లో, మరో వ్యక్తి కోటేశ్వరరావును పూలే అధ్యయన కేంద్రంలో అతిథి అధ్యాపకులుగా నియమించారు.   

అనుభవం లేకపోయినా....

ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణులైన జంగా చంద్రమోహన్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా తీసుకున్నారు. ఈయన ఐదేళ్ల కోర్సును పదేళ్లకు పూర్తి చేశారు. బోధనానుభవం అంతగా లేకపోయినా అప్పటి కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య సిద్ధయ్య నియమించారు. ఆయనకు వచ్చిన మార్కులను కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు అప్లోడ్‌ చేసినప్పుడు ఏఎన్‌యూ మాయాజాలం ప్రదర్శించింది. ద్వితీయశ్రేణికి బదులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు తప్పుడు వివరాలు పంపింది. ఈ విషయం. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు తెలిస్తే కళాశాలను బ్లాక్‌ లిస్టులో పెడుతుందని ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు మొత్తుకున్నా వారిని బెదిరించి మరీ తప్పుడు వివరాలు పంపారు. చంద్రమోహన్‌ది వర్సిటీ ఉన్నతాధికారిది ఒకే సామాజికవర్గం కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని