logo

వీరు మారరా?

గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్‌ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు.

Updated : 03 Jul 2024 05:01 IST

వైకాపా హయాంలో దోపిడీకి అలవాటు పడ్డ పోలీసు అధికారులు
ఇప్పటికీ కొనసాగుతున్న దందాలు
ఈనాడు - అమరావతి

గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన కొందరు సీనియర్‌ పోలీసు అధికారులు తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. వీరిలో కొందరికి గత ఎన్నికల సమయంలో జిల్లాలో మంచి పోస్టింగ్‌లు దక్కాయి. బాగా ఆదాయం వచ్చే స్టేషన్లకు ఏరికోరి మరీ వెళ్లారు. మొన్నటి ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయి.. తెదేపా కూటమి గద్దెనెక్కాక ఇంకా పోలీసుల బదిలీలను చేపట్టలేదు. చాలా స్టేషన్లలో ఎన్నికల సమయంలో నియమితులైనవారే కొనసాగుతున్నారు. వీరిలో డీఎస్పీ స్థాయి మొదలుకుని ఎస్సైల వరకూ ఉన్నారు. ప్రభుత్వం బదిలీలు చేసేలోగానే వసూళ్లతో చక్కబెట్టుకునే పనిలో కొంతమంది నిమగ్నమయ్యారు. ఇష్టానుసారం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడేందుకు కొంతమంది భయపడుతుంటే.. వైకాపా అండతో నాడు రెచ్చిపోయినవారు మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.

  •  ఇటీవల హోసన్నమందిరం వద్ద ఓ ఖాళీ స్థలంలోకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ప్రవేశించి తాత్కాలికంగా షెడ్డు నిర్మించారు. ఇది తెలిసి యజమాని వెళ్లి ప్రశ్నిస్తే.. ఈ స్థలం తనదేనంటూ అడ్డంగా వాదించి బెదిరింపులకు దిగాడు. దీంతో యజమాని డాక్యుమెంట్లతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అది సివిల్‌ వివాదమని, కోర్టులో తేల్చుకోవాలంటూ జవాబిచ్చారు. ఇది సివిల్‌ వివాదం ఎలా అవుతుందని, అతని వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని బాధితుడు ప్రాధేయపడగా.. షెడ్డు నిర్మాణదారుడు నష్టపరిహారం కోరతారని, ఎంతో కొంత ఇచ్చుకుంటే తప్ప అతడిని బయటకు పంపలేమంటూ ఓ పోలీసు అధికారి చెప్పారు. చివరకు బాధితుడి నుంచి రూ. 15 లక్షలు వసూలు చేశారు. ఈ అధికారికి గత వైకాపా ప్రభుత్వంలో అధికారం వెలగబెట్టిన సీనియర్‌ ఐపీఎస్‌తో సత్సంబంధాలున్నాయి.
  •  మిస్సింగ్‌ కేసులో ఓ యువతిని ఓ పోలీస్‌ అధికారి వెదికి పట్టుకొచ్చారు. రెండు, మూడ్రోజులపాటు ఆమెను దాచిపెట్టి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. విషయం తెలిసి వారు సదరు పోలీసు అధికారిపై అప్పటి వైకాపా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి సదరు అధికారిని మందలించడంతో యువతిని విడిచిపెట్టారు. ఆమెను వెతికి తెచ్చేందుకు రూ. లక్షల్లో ఖర్చయిందంటూ ఆ సొమ్ము వసూలు చేసుకున్నారు.
  •  మరో స్టేషన్‌ పరిధిలో రౌడీలు ఎక్కువ. అక్కడి అధికారి ఒకరు రౌడీల నుంచి బాగా సొమ్ము చేసుకుంటున్నారు. కుటుంబ వివాదాలు, ఇతర గొడవలతో స్టేషన్‌ గడప తొక్కితే చాలు.. ఆ అధికారి పరిష్కారం పేరుతో ఇరువైపుల నుంచీ డబ్బు గుంజుతున్నారు.  
  •  ఇటీవల నగరంలో స్థిరాస్తి వివాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి బాగా ఇబ్బంది పెట్టారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని