logo

ప్చ్‌.. ఫలించని శివశంకర్‌ ప్రయత్నాలు

పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా.

Published : 03 Jul 2024 04:25 IST

కడప కలెక్టర్‌గా బదిలీ

బాలికలతో పూర్వ కలెక్టర్‌ శివశంకర్‌ (పాత చిత్రం)

పల్నాడు జిల్లా గేయం సృష్టికర్తలో భాగస్వామినయ్యా.. నవోదయం పేరిట వినూత్న కార్యక్రమం తీసుకొచ్చా.. బాలికల్లో రక్తహీనతను అరికట్టేందుకు బంగారు తల్లిని స్కూళ్లలో అమలు చేశా.. జిల్లాలో సరిహద్దు బోర్డులు పెట్టించా.. ఇలా ఎన్నో చేశా.. మరోసారి పల్నాడు జిల్లాకే కలెక్టర్‌గా కొనసాగించే అవకాశమివ్వండి అని శివశంకర్‌ లోతేటి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఈనాడు డిజిటల్, నరసరావుపేట

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు జిల్లాలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో భాగంగా ఎస్పీ బిందుమాధవ్‌పై వేటు వేసినప్పుడే పల్నాడు కలెక్టర్‌గా ఉన్న శివశంకర్‌ను బదిలీ చేశారు. అయితే ఇంతకాలం ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. చివరకు ఆయనకు కడప జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది.

బంగ్లాలోనే ఉంటూ ..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన రెండురోజులకే ఎన్నికల సంఘం కలెక్టర్‌ శివశంకర్‌ను బదిలీ చేసింది. అప్పుడే కొత్త కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావ్‌ను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన వచ్చినా శివశంకర్‌ కలెక్టర్‌ బంగ్లాను ఖాళీ చేయలేదు. కొత్తగా వచ్చిన శ్రీకేశ్‌ బాలాజీరావ్‌ ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసి వెళ్లిపోయిన కల్పశ్రీ ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. 45 రోజులపాటు ఖాళీ చేయకుండా బంగ్లాలోనే శివశంకర్‌ ఉన్నారు. అక్కడే ఉంటూ ఎంపీ లావు, పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ రెండోసారి ఇక్కడే కొనసాగే ప్రయత్నాలు చేశారు. ఆయన వద్దకు వెళ్లిన వారితో పల్నాడు కలెక్టర్‌గా తానే వస్తాను అని చెప్పేవారు. నెల చివరి శనివారం సాహిత్యమేళా, రైతుకు వందనం, నవోదయం పేరిట దళితులకు రాయితీలపై వాహనాలు, రక్తహీనతతో బాధపడే బాలికలకు పౌష్టికాహారం అందించేలా బంగారుతల్లి, పల్నాడు వర్మి-పొలానికి బలిమి వంటి కార్యక్రమాలను అమలు చేశానని, జిల్లా అభివృద్ధిలో ఎంతో కృషి చేశానని, అందుకే రెండోసారి పల్నాడు కలెక్టర్‌గా  అవకాశమివ్వాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. చివరకు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని