logo

జడ్పీ భూముల్లో రాబందులు

ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు.

Updated : 03 Jul 2024 05:15 IST

తీర్మానాలు లేకుండానే స్వాధీనం
వైకాపా పాలనలో కరిగిన స్థలాలు
ఈనాడు, అమరావతి

ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తుకు చెందిన భూములను అయిన వారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. నిబంధనలకు నీళ్లొదిలి అధికారమే అండగా జడ్పీ భూములను చెరబట్టారు. సొంత పార్టీకి చెందిన జడ్పీ పాలకవర్గం అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపై ఒత్తిడి తెచ్చి భూములను దక్కించుకున్నారు. మార్కెట్‌లో రూ.కోట్ల విలువ చేసే భూములను పేదల పేరుతో దక్కించుకునే కుట్రకు తెరలేపారు. అనుమతులు తీసుకోకుండానే అధికార దర్పంతో జడ్పీ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేశారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సాగించిన భూ ఆక్రమణలు అన్నీఇన్నీకావు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈక్రమంలో జడ్పీ భూముల సంరక్షణకు వైకాపా నాయకులతో పోరాడాల్సి వచ్చిందని వాపోయారు.

పేదల పేరుతో  స్వాధీనానికి కుట్ర

వైకాపా తరఫున 2019లో సత్తెనపల్లి నుంచి గెలిచిన అంబటి రాంబాబు జలవనరులశాఖ మంత్రిగా పని చేశారు. సత్తెనపల్లిలో జడ్పీకి చెందిన 2.74 ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసే పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. 2023లో జరిగిన జిల్లాపరిషత్తు సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. బహిరంగ మార్కెట్‌లో రూ.20కోట్ల విలువైన భూముల్లో నివాసం ఉంటున్న వారికి నామమాత్ర ధరకు విక్రయించాలని ప్రతిపాదించారు. అనంతరం రూ.కోట్ల విలువైన భూమిని చేజిక్కించుకునే కుట్రకు తెరలేపారు.

ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జడ్పీ భూములను ఇతరులకు దీర్ఘకాల అవసరాలకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే లీజుకు ఇవ్వాలి. అది కూడా శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. అయినప్పటికీ అప్పట్లో ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అక్కడి నుంచి ఆమోదం రాకపోవడంతో ఆగిపోయింది.

అధికారమే అండగా.. అనుమతులే లేకుండా..

2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గం తన సామ్రాజ్యం అన్నట్లుగా భావించారు. మంగళగిరి జాతీయ రహదారి పక్కన జడ్పీకి చెందిన 60 సెంట్ల భూమిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ కేంద్రాల నిర్మాణాలు చేయించారు. జిల్లా పరిషత్తుకు చెందిన భూముల్లో ఏవైనా నిర్మాణాలు చేయాలంటే స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకుండానే ఆయన ఇష్టానుసారం నిర్మాణాలు చేయించారు. జడ్పీ పాలకవర్గం, అధికారులు ఆ భూమి జడ్పీకి చెందినదని బోర్డు పెట్టినా తొలగించేసి మరీ నిర్మాణాలు చేయడం అప్పట్లో ఆయన అధికార దర్పానికి నిదర్శనం. మంగళగిరి పాత బస్టాండ్‌ కూడలిలో జడ్పీకి చెందిన 25 సెంట్ల స్థలంలో చేనేత దుకాణాల సముదాయం నిర్మించారు. 2019 నుంచి 2022 వరకు లీజుకు తీసుకున్నారు. ఏడాదికి రూ.10 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద కాలం ముగిసి ఏడాదిన్నర కాలం అవుతున్నా అద్దెలు చెల్లించడం లేదు. ఇక్కడ ఏకంగా జీ ప్లస్‌ 4 భవనాన్ని నిర్మించడం గమనార్హం. ఇక్కడ గజం స్థలం రూ.వేలల్లో ధర పలుకుతోంది. 

రికార్డులోన్లే 2వేల ఎకరాల భూములు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో జడ్పీకి 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. వీటిలో సింహభాగం భూములు రాజకీయ పార్టీల నాయకుల చెరలోనే ఉన్నాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో భూములను వైకాపా నాయకులు ఆక్రమించారు. కొందరు లీజుల పేరుతో, మరికొందరు అనధికారికంగా సొంతం చేసుకున్నారు. వైకాపా నాయకుల చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని జడ్పీకి ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఈ విషయమై జడ్పీ సీఈవో వసంతరాయుడుని వివరణ కోరగా ఆక్రమణలో ఉన్న భూముల వివరాలు సేకరించి వాటిని స్వాధీనం చేసుకుంటాం. ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని వివరించారు.

 వినుకొండ పట్టణంలో జడ్పీ భూమిలో చిరు వ్యాపారాలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. జడ్పీకి ఎలాంటి అద్దెలు చెల్లించడం లేదు. దీనిపై అధికారులు దుకాణాదారులను ప్రశ్నిస్తుంటే మున్సిపాలిటీ స్థలంలో ఉన్నామని చెప్పి దాట వేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున పదుల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. జడ్పీ అధికారులు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తే వైకాపా నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలోనైనా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆదాయం పెంచుకోవాల్సి ఉంది.
తాడికొండ నియోజకవర్గం  బడేపురం గ్రామంలో జడ్పీకి చెందిన భూమిని వైకాపా నేత ఒకరు లీజుకు తీసుకుని తర్వాత తన కుటుంబ సభ్యుల పేరుతో రెవెన్యూ అధికారి సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో ఎక్కించారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. తెదేపా నాయకులు జడ్పీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లగా చుట్టూ ఫెన్సింగ్‌ వేసి ఉండటంతో అధికారులు ఖంగుతిన్నారు. వెబ్‌ల్యాండ్‌లో వైకాపా నేత పేరు తొలగించారు. ఫెన్సింగ్‌ తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా లీజుదారుడు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో కేసు నడుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.కోట్ల విలువ చేసే భూమి వైకాపా నాయకుడి ఆధీనంలో ఉండటం గమనార్హం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని