logo

రాజధానిలో ఇసుక దందా

రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 03 Jul 2024 04:13 IST

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ సోదరుడు, అనుచరుల అక్రమాలు

శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో నిల్వ చేసిన ఇసుక

తుళ్లూరు, న్యూస్‌టుడే:  రాజధానిలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెంలో ముళ్లపొదల చాటున కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక నిల్వ చేసి రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ పెదనాన్న కుమారుడు (వరుసకు సోదరుడు) నందిగం ప్రభుదాస్‌ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తూ ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు పట్డుబడ్డారు. ఆయనతోపాటు పాటు లారీ ఓనరు సుధీర్, ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని మంగళవారం స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ ఘటనలో ఇసుక లారీని, దాని వెనుక రక్షణగా వస్తున్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేష్‌ అనుచరులైన వీరు గతంలో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. పోలీసులు చర్యలు తీసుకోకుండా వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చినా వారి ఆగడాలకు అంతులేకుండా పోతుందని, పవిత్రమైన రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని గత వైకాపా ప్రభుత్వం ఇసుక మాఫియాకు అడ్డాగా మార్చిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చుట్టూ నిల్వలే..

అధికార పార్టీ అండదండలతో అప్పట్లో గ్రామంలో నివాసం ఉన్న ఓ ప్రజా ప్రతినిధి అనుచరులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపారు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండా అక్రమ మార్గంలో వందల సంఖ్యలో లారీల్లో ఇసుక అమ్మి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ చూసినా గుట్టలుగా ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. అప్పట్లో పనిచేసిన అధికారులు వైకాపా నాయకులతో అంట కాగి అక్రమార్కులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు