logo

గుంటూరు ఛానల్‌ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గుంటూరు ఛానల్‌ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు.

Published : 03 Jul 2024 04:10 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామాంజనేయులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గుంటూరు ఛానల్‌ అభివృద్ధికి తెదేపా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఛానల్‌ను పొడిగించేందుకు మొదట విడతగా రూ.110 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 47 కిలోమీటర్లు 600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న గుంటూరు ఛానల్‌ను రాబోయే రోజుల్లో 74 కిలోమీటర్లు పొడిగించి 750 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం. ఇందుకు మొత్తం రూ.376 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. రాబోయే అయిదేళ్లలో ఇది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం కనీసం కాల్వల్లో పూడికతీత, గుర్రపుడెక్కను తొలగించకపోవడంతో పంటలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. వీటిని తొలగించేందుకు తక్షణమే రూ.1.73 కోట్లు మంజూరు చేయాలని కోరాం. షార్ట్‌ టెండర్‌ ద్వారా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గుత్తేదారులు ఎవరైనా అత్యాశకు పోయి 50 శాతం లెస్‌కు టెండర్లు వేస్తే సహించేది లేదు. గత వైకాపా ప్రభుత్వంలో ఈవిధంగానే జరిగింది. పనుల్లోనూ నాణ్యత, ప్రమాణాలు పాటించాలి. పనులు చేసిన వెంటనే బిల్లులు మంజూరయ్యేలా చూస్తాం. గత ప్రభుత్వం గుత్తేదార్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు జరగలేదు. రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చి మరమ్మతులు చేసేందుకు రూ.3.75 కోట్లు మంజూరయ్యాయి’.. అని పేర్కొన్నారు. ‘నూతన ప్రభుత్వం ఏర్పడిన పక్షం రోజుల్లోనే మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు, పేదలకు పింఛన్లు అందజేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 92,138 మందికి రూ.63 కోట్లు పింఛన్లు పంపిణీ చేశాం. విద్య, ఆరోగ్యం విషయంలో ఎవరైనా తప్పు చేస్తే రాజీ పడే ప్రసక్తే లేదు. పంచాయతీ నిధుల్ని ఇష్టం వచ్చినట్లు గత పాలకులు దారి మళ్లించారు. అన్నీ లెక్కలు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల బదిలీల్లోనూ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు’.. అని సూచించారు. సమావేశంలో డీపీఓ శ్రీదేవి, డీఐఓ సుబ్బరాజు, పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని