logo

రైతుల ముసుగులో వైకాపా నాయకుడి దోపిడీ

రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Published : 03 Jul 2024 04:09 IST

నిబంధనలకు విరుద్ధంగా విత్తన వ్యాపారం
విజిలెన్స్‌ దాడులను అడ్డుకొనేందుకు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు డబ్బాలు పట్టుకున్న అమ్మిశెట్టి సాంబశివరావు 

పెదకాకాని, న్యూస్‌టుడే: రైతుల ముసుగులో వైకాపా నాయకుడు దోపిడీకి పాల్పడుతున్నారు. పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వరి విత్తనాల బస్తాలను స్థానిక నాయకుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో వ్యవసాయశాఖ విజిలెన్స్‌ అధికారి రమణకుమార్‌ మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో కరీంనగర్‌ నుంచి నందీశ్వర సీడ్స్‌ కంపెనీకి చెందిన 30 కేజీల బరువున్న 400 విత్తన బస్తాలు లారీలోంచి వైకాపా నాయకుడు, పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి మాజీ ఛైర్మన్‌ అమ్మిశెట్టి శివశంకర్‌రావుకు చెందిన గోదాములోకి దించుతున్నారు. అధికారి వెళ్లి లోడుకి సంబంధించి బిల్లు చూడగా అమ్మిశెట్టి శివశంకర్‌రావు పెద్దకుమారుడు రోజేశ్వరరావు పేరుపై ఉంది. ఆ సమయంలో కొందరు రైతులు అక్కడికి వెళ్లి తాము గ్రూపుగా ఏర్పడి విత్తనాలను తెప్పించినట్లు చెప్పడంతో విజిలెన్స్‌ అధికారి వారి నుంచి వివరాలు నమోదు చేసుకొని వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం విజిలెన్స్‌ అధికారులతో కలిసి ఏవో సంధ్యారాణి విత్తనాల గోదాము వద్దకు వెళ్లి సీజ్‌ చేసే ప్రయత్నం చేశారు. కాసేపు అధికారులు, శివశంకర్‌రావు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులను బెదిరించే క్రమంలో శివశంకర్‌రావు కుమారుడు అమ్మిశెట్టి సాంబశివరావు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చేసేది లేక ఏవో ఎన్ని బస్తాలు ఎంత మంది రైతులు తీసుకున్నారో వివరాలు నమోదు చేసుకొని వెళ్లారు. అనంతరం ఏడీఏ ఎం.సునీల్‌ విత్తనాలకు సంబంధించి గ్రామంలో క్షేత్ర స్థాయి విచారణ జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని