logo

ఇంటికే పింఛను.. నవ్వులు విరబూసెను..

పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది.

Published : 02 Jul 2024 04:47 IST

సీఎం చంద్రబాబు రాకతో ఉప్పొంగిన అభిమానం
ఈనాడు, అమరావతి, తాడేపల్లి, న్యూస్‌టుడే

ప్రజావేదికలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, పాల్గొన్న మంత్రులు లోకేశ్, శ్రీనివాస్, కలెక్టర్‌ నాగలక్ష్మి తదితరులు

పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ ఇంకా సూరీడు ఉదయించకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. ఎన్టీఆర్‌ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పింఛను లబ్ధిదారులకు సొమ్ము పంపిణీ చేసేందుకు స్వయంగా సీఎం వస్తున్నారనే సమాచారంతో గ్రామం మొత్తం కదలివచ్చింది. వేకువజాము నుంచే ప్రజావేదిక సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకున్నారు. వేదిక ఎదుట గ్రామస్థుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుని చంద్రబాబు రాక కోసం నిరీక్షించారు. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారాలోకేశ్‌ ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వెళ్లారు. అక్కడి నుంచి సీఎం చంద్రబాబుతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 6.16 గంటలకు పెనుమాక చేరుకుని కాలినడకన లబ్ధిదారుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కోటేశ్వరమ్మ అనే మహిళ హారతి ఇచ్చి స్వాగతం పలికారు.

తన స్వహస్తాలతో పింఛను ఇవ్వడానికి నిరుపేద ఇంట్లోకి వస్తున్న సీఎం

నవ్వుతూ.. నవ్విస్తూ..

సభలో ఓ మహిళ ఆనందం

పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో ఆయన వెంట నడిచారు. మంత్రులు నారాలోకేశ్, కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి సీఎం చంద్రబాబు వెంట ఉన్నారు. చంద్రబాబుతో ఫొటో దిగేందుకు చిన్నారితో కలిసి మహిళ ముందుకు రావడంతో పాపను చేతిలోకి తీసుకుని వారితో ఫొటో దిగారు. దీంతో వారంతా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. ఆయా వీధుల్లోకి చేరుకున్న కార్యకర్తలు ఇళ్ల బయటకు వచ్చి అభివాదం చేశారు. కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కొంత మంది యువకులు బాబుతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. నవ్వుతూ నవ్విస్తూ చంద్రబాబు ప్రజలను కుశల ప్రశ్నలు వేశారు. చంద్రబాబు పలకరింపులతో స్థానికులు పులకించిపోయారు. ఆయనతో మాట్లాడాలని ముందుకు వచ్చినవారితో మాట్లాడుతూ నడక సాగించారు. లబ్ధిదారుల ఇంటికి చేరుకున్న బాబు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారు ఇచ్చిన టీ తాగిన అనంతరం పాములు నాయక్‌కు వృద్ధాప్య, సాయి అనే మహిళకు వితంతు పింఛన్, సీతా అనే మహిళకు సీఆర్‌డీఏ పింఛను అందించారు. ఉండడానికి ఇల్లు లేదని లబ్ధిదారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ఆయన వెంటనే ఇంటి మంజూరు పత్రాన్ని అందించారు.

లబ్ధిదారు పాములునాయక్‌ బయోమెట్రిక్‌ తీసుకుంటున్న సచివాలయ సిబ్బంది

పెనుమాక వీధిలోకి వచ్చిన చంద్రబాబుకు హారతి ఇస్తున్న మహిళ

తెనాలి పట్టణం 18వ వార్డులో దివ్యాంగుడికి పింఛను అందిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌


న్యూస్‌టుడే, జిల్లాపరిషత్తు (గుంటూరు), మేడికొండూరు, పొన్నూరు, చేబ్రోలు

చేబ్రోలు సచివాలయం-3 పరిధిలోని కారుమూరి మరియమ్మ అనారోగ్యంతో వడ్లమూడి డీవీసీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సచివాలయ ఉద్యోగిని సుజాత ఆమెకు పింఛను నగదును ఇచ్చేందుకు వైద్యశాలకు రాగా.. అదే సమయంలో అక్కడే ఉన్న పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ సుజాతను అభినందించి నగదును మరిమయ్మకు అందజేశారు.

జిల్లాలో ఇలా...

జిల్లాలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేశారు. ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో పింఛన్లను పంపిణీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. నగదు అందజేసిన తర్వాత ముట్టినట్లు రసీదులపై లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకున్నారు. సీఎం రాసిన లేఖకు సంబంధించి కరపత్రాలను లబ్ధిదారులకు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనలతో ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే ఇళ్లకు వచ్చి పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు నాటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందామని పేర్కొన్నారు.

ఒకే రోజు 94.31 శాతం పంపిణీ

జిల్లాలో మొత్తం 2,58,786 మందికి రూ.174 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒకటో తేదీనే 100 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. దీంతో ఉద్యోగులు ఉదయం 6 గంటలకే గ్రామాలు, వార్డులకు చేరుకుని లబ్ధిదారులకు నగదు అందజేయడం ప్రారంభించారు. సాయంత్రం 7గంటలకు 2,42,980 మందికి రూ.165 కోట్లు సొమ్ము అందజేశారు. 94.31 శాతం పంపిణీ చేశారు. సర్వర్‌ పనిచేయకపోవటం, సాంకేతిక సమస్యలతో 15,806 మందికి పెన్షన్లు పంపిణీ చేయలేదు. వీరికి మంగళవారం నగదు పంపిణీ చేస్తారు.


తండ్రీ కుమారులకు సాంత్వన

ఈ చిత్రంలోని వారు పొన్నూరు 29వ వార్డుకు చెందిన తండ్రి పఠాన్‌ బికారి (66), కుమారుడు హాసన్‌ఖాన్‌. బికారి ఆర్టీసీలో మెకానిక్‌లో పనిచేసి విరమణ పొందారు. కొన్నేళ్ల కిందట లారీ ఢీకొనడంతో ఒక కాలు కోల్పోయారు. వృద్ధాప్యం మీద పడటంతో నడలేక మంచానికే పరిమితమయ్యారు. బికారి భార్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కుమారుడు హాసన్‌ఖాన్‌ కూలీ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు కష్టకాలంలో అండగా నిలిచాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న సమయంలో హాసన్‌ఖాన్‌కు పక్షవాతం రావడంతో మంచం పట్టాడు. హాసన్‌ఖాన్‌ భార్య కొంత కాలం కిందట అనారోగ్య సమస్యలతో మృతి చెందడం కుటుంబానికి తీరని లోటుగా మిగిలింది. తండ్రి, కుమారుడికి పింఛన్ల డబ్బులే జీవనాధారంగా మారింది. తండ్రి బికారికి రూ.4 వేలు, కుమారుడు హాసన్‌ఖాన్‌కు రూ.15 వేలు పింఛను మంజూరు కావడటంతో తమకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తోందని వారు సంతోషాన్ని వ్యక్తంచేశారు.


విధి వంచితులకు పింఛనే ఆధారం: దానబోయిన లక్ష్మీకాంతమ్మ, వెనిగండ్ల

మేనరిక వివాహం కావడంతో అయిదుగురు కుమారులు, కుమార్తె చిరుప్రాయంలోనే మరణించారు. చివరి సంతానం పాములు(23)కు మానసికంగా ఎదుగుదల లేదు. చివరకు కాలకృత్యాలు వచ్చే విషయం కూడా తెలియదు. అన్నీ నేనే చూసుకోవాలి. పాఠశాల ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజన పథకం ఆహారం సిద్ధం చేయాలనడంతో కుమారుడిని బడికి తీసుకెళ్లడం ఇబ్బందికరంగా మారి పని మానుకున్నా. భర్త వీరభద్రయ్యకు అనారోగ్యంతో పనులకు వెళ్లడం లేదు. దాంతో ప్రభుత్వం అందజేసే పింఛనే ఆధారమైంది. వాటితోనే కుమారుడు, భర్త మందులకు రూ.1,600 వరకు ఖర్చవుతున్నాయి. మిగిలిన సొమ్ముతోనే నెలవారీ ఖర్చులు చూసుకోవాలి. స్థానికులు, బంధువులు కొంత సాయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్‌ని రూ.6 వేలకు పెంచడంతో భరోసా దక్కింది. సీఎం చంద్రబాబు పింఛన్ల నగదు పెంచి కుటుంబానికి అండగా నిలిచారు.


ఒంటరి జీవితానికి భరోసా: పసుపులేటి అంకమ్మరావు, వెనిగండ్ల

పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులూ వంకరపోయాయి. ఏ పని చేయాలన్నా సమస్యలు ఎదురయ్యేవి. అయిదుగురు అన్నదమ్ములున్నా వివాహాలయ్యాయి. నా ఆలనాపాలనా చూసిన తల్లి యలమందమ్మ అయిదేళ్ల కిందట మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్నా. గత ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.3 వేల పింఛన్‌ చాలక చిన్న చిన్న పనులకు వెళ్లి జీవితాన్ని సాగదీస్తున్నా. దివ్యాంగుల పింఛన్‌ని రూ.6 వేలకు పెంచడంతో భరోసా లభించింది. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చెల్లించడం ఆనందాన్నిస్తుంది. 


రూ.15వేల పెంపుతో ఉపయుక్తం

25 ఏళ్ల కిందట వెన్నెముక దెబ్బతింది. మంచానికే పరిమితమయ్యా. ఏ పనీ చేయలేకపోతున్నా. విడతల వారీగా పింఛను పెరుగుతూ వస్తోంది. గత ప్రభుత్వం చివరిలో రూ.5వేలు పింఛను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రూ.15వేలకు పెంచడంతో నాలాంటి వాళ్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎంతో సంతోషంగా ఉన్నా. ఎన్నికల సమయంలో పింఛనుదారులకు ఎన్డీయే కూటమి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది.

మోపర్తి అప్పారావు, పేరేచర్ల గ్రామం, మేడికొండూరు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని