logo

లబ్ధిదారుల ఇంటికి చంద్రన్న.. పులకించిన పెనుమాక

పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది.

Published : 02 Jul 2024 04:37 IST

ఈనాడు, అమరావతి

పెనుమాకలో లబ్ధిదారు ఇంట్లోకి ప్రవేశిస్తున్న సీఎం చంద్రబాబు

పెనుమాకకు పండగొచ్చింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ ఇంకా సూరీడు ఉదయించక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి వెళ్లడంతో సందడి నెలకొంది. ఎన్టీఆర్‌ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పింఛను లబ్ధిదారులకు సొమ్ము పంపిణీ చేసేందుకు స్వయంగా సీఎం వస్తున్నారనే సమాచారంతో గ్రామం మొత్తం కదలివచ్చింది. సీఎం చంద్రబాబు ఉదయం 6.16 గంటలకు పెనుమాకకు చేరుకుని కాలినడకన లబ్ధిదారుల ఇంటికి బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో ఆయన వెంట నడిచారు. మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి సీఎం చంద్రబాబు వెంట ఉన్నారు. చంద్రబాబుతో ఫొటో దిగేందుకు చిన్నారితో కలిసి మహిళ ముందుకు రావడంతో పాపను చేతిలోకి తీసుకుని వారితో ఫొటో దిగారు. చంద్రబాబు పలకరింపులతో స్థానికులు పులకించిపోయారు.  లబ్ధిదారుల ఇంటికి చేరుకున్న బాబు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారు ఇచ్చిన టీ తాగిన అనంతరం పాములు నాయక్‌కు వృద్ధాప్య, సాయి అనే మహిళకు వితంతు పింఛన్, సీతా అనే మహిళకు సీఆర్‌డీఏ పింఛను అందించారు. ఉండడానికి ఇల్లు లేదని లబ్ధిదారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ఆయన వెంటనే ఇంటి మంజూరు పత్రాన్ని అందించారు.

పాములునాయక్‌ బయోమెట్రిక్‌ తీసుకుంటున్న సచివాలయ సిబ్బంది

మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి: మంత్రి లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి నిర్మాణానికి, అమరావతి అభివృద్ధిలో మంగళగిరి ప్రజలు భాగస్వామ్యులు అవుతారన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి ప్రజల రుణం తీర్చుకోవడానికి బాగా పనిచేయాలని, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్థికంగా ముడిపడని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.  

ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేశ్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని