logo

ఆనందం కనిపింఛెన్‌

‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్‌.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.

Published : 02 Jul 2024 04:33 IST

లబ్ధిదారులకు పెంచిన నగదుతో కలిపి రూ.7వేలు అందజేత
అవ్వాతాతల ముఖాల్లో రెట్టింపైన సంతోషం
ఊరూవాడా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు

చిత్రంలోని వృద్ధురాలు సన్నబోయిన లక్ష్మమ్మ. ఊరు గురజాల. సోమవారం చేతిలోకి రూ.ఏడు వేలు పింఛను నగదు అందడంతో ఆనందంతో సీఎం చంద్రబాబుకు జై అంటూ నినాదాలు చేసింది. ఆమెకు ఎవరూ లేరు. ఒంటరిగా ఉంటోంది. వచ్చే పింఛనుతోనే రోజు గడిచేది. గతంలో అనారోగ్యం వస్తే ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి ఇబ్బందిపడేది. మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నా కష్టమే. అలాంటిది రూ.ఏడు వేలు అందడంతో సమస్యలు కొంతమేర తీర్చుకోవచ్చని చెబుతోంది.

చిత్రంలోని వృద్ధురాలు కురవడి మరియమ్మ. ఊరు నరసరావుపేట మండలం రావిపాడు. ఈమెకు ఇద్దరు కుమారులు. ఒకరు వేరేచోట ఉంటే, స్థానికంగా ఉండే కుమారుడు కూడా బాగోగులు పట్టించుకోడు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. సీఎం చంద్రబాబు పుణ్యాన మొదటిసారిగా రూ.ఏడు వేలు అందుకున్నానని, చాలా ఆనందంగా ఉందని, ఇంత మొత్తం అందుకుంటానని అనుకోలేదని అంటోంది. మంచి ఆహారం కొనుగోలు చేయడానికి వినియోగిస్తానని చెబుతోంది. చంద్రబాబు చల్లగా ఉండాలని దీవించింది.

చిత్రంలోని వృద్ధురాలు పూర్ణమ్మ. శావల్యాపురం మండలం కారుమంచి ఎస్టీకాలనీ. ఈమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. రేకుల షెడ్డులో ఒంటరిగా ఉంటోంది. పెద్ద కుమారుడిలా సీఎం చంద్రబాబు పింఛను సొమ్ము రూ.ఏడు వేలు అందజేశారని, ఆనందంగా ఉందని చెప్పింది. నగదుతో నెల హాయిగా గడిచిపోతుందని చెబుతోంది. చంద్రన్న చల్లని చూపుతో వృద్ధులు హాయిగా కాలం వెళ్లదీస్తారని పేర్కొంది.

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘పెద్దకొడుకులా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్‌.. మా దీవెనలు అందుకుని నిండునూరేళ్లు జీవించి పేదల అభ్యున్నతికి పాటుపడుతూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాల’ంటూ అవ్వాతాతలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారంలో పింఛను రూ.వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించినప్పుడు వైకాపా విమర్శించింది. హామీ ఇచ్చినప్పటి నుంచి కలిపి మూడునెలల బకాయిలతో రూ.ఏడు వేలు ఇస్తానన్నప్పుడు కూడా బాబు మాటలు నమ్మకండి అంటూ ఓటర్లను తప్పుదోవ పట్టించారు. కానీ వైకాపా కల్లబొల్లి మాటలను ఓటర్లు నమ్మలేదు. కూటమికి అఖండ మెజార్టీ సీట్లతో అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే సంక్షేమ పండగల్లో తొలి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సోమవారం ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచే ఇంటివద్దే సచివాలయ ఉద్యోగులతో ఎన్టీఆర్‌ భరోసా పింఛను నగదు పంపిణీ చేయించారు. దీంతో రూ.ఏడు వేలు అందుకున్న అవ్వాతాతలు, రూ.ఆరువేలు అందుకున్న దివ్యాంగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

పలుచోట్ల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి..

నరసరావుపేట మండలం ఇక్కుర్రులో ఉదయం 6 గంటలకే కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీరావ్, ఎమ్మెల్యే అరవిందబాబు, డీఆర్‌డీఏ పీడీ బాలూనాయక్‌ ఓ దివ్యాంగుడికి రూ.6వేలు అందజేశారు. అనంతరం అల్లూరివారిపాలెంలోని ఓ వృద్ధుడికి రూ.ఏడు వేలు అందజేశారు. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వెల్దుర్తిలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. శావల్యాపురం బీసీకాలనీలో పింఛను పంపిణీలో జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పింఛను నగదు లబ్ధిదారులకు అందజేశారు. అమరావతి మండలం లేమల్లెలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ పాల్గొని పింఛను నగదు పంపిణీ చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట రజక కాలనీలో లబ్ధిదారులకు పింఛను అందజేశారు.   మొదటిరోజు సాయంత్రంలోపు 90.89 శాతం పింఛను పంపిణీ చేశామని డీఆర్‌డీఏ పీడీ బాలూనాయక్‌ అన్నారు.

గురజాల మండలం సమాధానం పేటలో కేకు కోస్తున్న కూటమి నేతలు

చిత్రపటాలకు పాలాభిషేకాలు..

అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి సామాజిక పింఛన్లను పెంచి, పండుటాకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసిన సీఎం చంద్రబాబుకు వాడవాడలా కృతజ్ఞతలు తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో కూటమి శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఉదయాన్నే తమ ఇళ్లల్లోకి పండగను తీసుకొచ్చిన చంద్రబాబును తలుచుకుని దివ్యాంగులు, వృద్ధులు నమస్కరించారు. చేతికందిన పింఛను నగదు ఆదుకుంటోందని, ఎవరూ లేని తమకు ఇవే జీవనాధారమని పలువురు తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. మంచానికే పరిమితమైన రోగులు, నడవలేని దివ్యాంగులు, కుమారులు వదిలేసిన వృద్ధులు ఇలా పింఛను అందుకున్న పలువురు పెంచిన నగదుతో హాయిగా నిశ్చింతంగా బతకొచ్చని ధైర్యంగా చెప్పారు.

రొంపిచర్లలో చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం


ఆనందంగా ఉంది

భర్త చనిపోయి పదేళ్లు అయింది. కుమారుడు ఒక్కడు పొట్టకూటి కోసం పట్టణంలో ఉంటాడు. నాకు ఆదరవు ప్రభుత్వ పింఛను మాత్రమే. చంద్రన్న వచ్చి పింఛను రూ.4వేలకు పెంచాడు. అంతేకాక గత మూడు నెలలు, ఈనెలవి కలిపి రూ.7 వేలు ఇచ్చాడు. వచ్చేనెల నుంచి రూ.4 వేలు వస్తుంది. ఇబ్బంది లేకుండా కుమారుడిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తా. 

కోట ఎమేలమ్మ, లింగంగుంట్ల


చంద్రబాబుకు రుణపడి ఉంటాం

మాది సత్తెనపల్లి పట్టణంలోని 22వ వార్డు. నాకు ఇద్దరు కుమారులు. పుట్టుకతో ఇద్దరూ దివ్యాంగులే. 18 ఏళ్ల వయసులో ఓ కుమారుడు మృతి చెందాడు. ఇప్పుడున్న కుమారుడు మణికంఠకు 23 ఏళ్లు. సొంతంగా ఏ పని చేసుకోలేడు. నాతోపాటు సతీమణి శివకుమారి అనారోగ్యం బారినపడ్డాం. గత నెల వరకు నాకు, కుమారుడికి కలిపి నెలకు రూ.6 వేలు పింఛను అందేది. అందులో రూ.3 వేలు కుమారుడి ఔషధ ఖర్చులకే సరిపోయేవి.  పింఛను పెంచిన చంద్రబాబుకు రుణపడి ఉంటాం. 

కుంచనపల్లి శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని