logo

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం

నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్‌ లక్ష్మణ నాయక్‌ ఎస్పీ మలికా గార్గ్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 02 Jul 2024 09:37 IST

ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్థిరాస్తి వ్యాపారి లక్ష్మణనాయక్‌

గోపిరెడ్డిపై ఫిర్యాదు పత్రాన్ని చూపుతున్న బాధితుడు లక్ష్మణ నాయక్‌

నరసరావుపేట టౌన్, న్యూస్‌టుడే : నరసరావుపేట వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరుడు దానారెడ్డి తనను మోసగించి తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈపూరు మండలం ఊడిచెర్ల తండాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కొడావత్‌ లక్ష్మణ నాయక్‌ ఎస్పీ మలికా గార్గ్‌కు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారికి తన ఆవేదన వెల్లడించారు. అనంతరం పాత్రికేయుల వద్ద తన బాధ తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే..

నరసరావుపేట మండలం కాకాని రెవెన్యూ పరిధిలో 9.88 ఎకరాలు పట్టణానికి చెందిన దానరెడ్డి వద్ద కొనేందుకు బేరం కుదుర్చుకున్నా. 2021లో ముందస్తుగా రూ.కోటి చెల్లించి, ఎకరాకు రూ.55 లక్షలు వంతున ప్రతి నెలా రూ.కోటి ఇచ్చేలా ఒప్పంద పత్రం రాసుకున్నాం. లేఅవుట్‌ అభివృద్ధి చేశాక దీనిలోకి రాకపోకలకు దారి లేదంటూ మెలిక పెట్టారు. రూ.50 లక్షలు ఇస్తే సమస్య పరిష్కరిస్తామని అప్పటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్ద పంచాయితీ పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో గోపిరెడ్డికి రూ.20 లక్షలు, ఆయన సూచించిన శివరామకృష్ణకు మరో రూ.30 లక్షలు బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాకు చెల్లించాను. స్థలం యజమానికి రూ.1.50 కోట్లు ఇచ్చాను. అయినా దారి చూపించలేదు. గోపిరెడ్డి చుట్టూ అనేకసార్లు తిరిగినా పట్టించుకోలేదు. విషయాన్ని బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన రవిశంకర్‌రెడ్డి, నరసరావుపేట గ్రామీణ పోలీసు అధికారులను సంప్రదించాను. నా వద్ద ఫిర్యాదు తీసుకోకుండా మాజీ ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారిని ప్రభావితం చేశారు. న్యాయం కోసం ఇప్పుడు మళ్లీ ఎస్పీకి విన్నవించాను. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. లేదంటే వీధుల పాలైన తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని