logo

వివాదాస్పద సీఐకి కీలక పోస్టింగ్‌

గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు.

Published : 02 Jul 2024 04:16 IST

ఇదీ కథాకమామిషు!
ఈనాడు, అమరావతి

గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచిగా కొనసాగుతున్నారు. అయినా కూటమి ప్రభుత్వంలో శ్రీనివాసరావుకు కీలకమైన తుళ్లూరు పోస్టింగ్‌ దక్కడం గమనార్హం. పోలీసు, తెదేపా, వైకాపా వర్గాల్లో ఆయన పోస్టింగ్‌ వ్యవహారంపై పెద్దచర్చ జరుగుతోంది. అదెలా సాధ్యమైందని ఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. సొంత తమ్ముడు ఒకవైపు వైకాపా సర్పంచిగా ఉన్నా ఆయనకు ప్రాధాన్య పోస్టింగ్‌ దక్కడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీనివాసరావు సొంతూరు రేపల్లె మండలం చౌడాయిపాలెం. ఆ గ్రామానికి ఆయన తమ్ముడు రవిబాబు గత ఎన్నికల్లో వైకాపా మద్దతుతో పోటీ చేసి గెలుపొందారు. తమ్ముడు గెలుపు కోసం అప్పట్లో ఆయన గ్రామానికి వచ్చి తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపారని ఆ గ్రామ తెదేపా వర్గాలు అంటున్నాయి. రేపల్లెలో ఓ మండల వైకాపా నేతతో సత్సంబంధాలు కలిగిన సీఐ శ్రీనివాసరావు గత వైకాపా ప్రభుత్వంలో గుంటూరులో కీలకమైన లాలాపేట పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఆ మండల నేత సాయంతో ఎంపీ ద్వారా సిఫార్సు చేయించుకుని నాడు వైకాపా ప్రభుత్వంలోనూ మంచి పోస్టింగ్‌ పొందారు. అయితే అక్కడ పనిచేసే సమయంలో ఓ డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన ఎమ్మెల్యే బంధువుల పిల్లలను కేసు నుంచి తప్పించి సొంత లబ్ధి చూసుకున్నారనే ఆరోప£ణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఆయన్ని స్టేషన్‌ బాధ్యతల నుంచి తప్పించి వీఆర్‌కు పంపారు. అలాంటి వివాదాస్పద వ్యక్తికి మంచి పోస్టింగ్‌ రావడం ప్రశ్నార్థకమవుతోంది.

నాడు తెదేపా వారిని ఇబ్బంది పెట్టారు .. ప్రకాశం జిల్లా కొండపి సర్కిల్‌ సీఐగా పనిచేసిన సమయంలో ఈ సీఐ అక్కడ తెదేపా కార్యకర్తలు, నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అప్పట్లో కొండెపి తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా అడుగడుగునా తెదేపా వారిని ఇబ్బంది పెట్టినా.. వైకాపా వారితో సత్సంబంధాలు కలిగినా సదరు అధికారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన రాజధానిలోని తుళ్లూరు సర్కిల్‌ దక్కడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. ఈయన అత్యంత వివాదాస్పద అధికారిగా శాఖలో ముద్రపడ్డారు. అలాంటి అధికారికి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కీలకమైన స్టేషన్‌ బాధ్యతలు అప్పగించడంపై పోలీసు వర్గాలే కాదు తెదేపా వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని