logo

అర్జీలు సత్వరం పరిష్కరించాల్సిందే

ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధికారులకు సూచించారు.

Published : 02 Jul 2024 04:13 IST

ప్రజల నుంచి అర్జీలు తీసుకుని మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ రాజకుమారి తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. శాఖాపరమైన దస్త్రాలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో 142 మంది అర్జీదారులు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జేసీ జి.రాజకుమారి, డీఆర్వో పెద్ది రోజా, గుంటూరు ఆర్డీవో శ్రీకర్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


భూమి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు

మా అమ్మ సామ్రాజ్యం పేరుతో ఎకరం పొలం ఉండగా.. 80 సెంట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులను అడిగితే సర్వే చేయించుకోమన్నారు. మిగిలిన 20 సెంట్లు భూమి కూడా ఉందని వారే తేల్చినా ఆన్‌లైన్‌లో నమోదు చేయమంటే రెండేళ్లుగా పట్టించుకోవడం లేదు. అమ్మ పెద్ద వయసు కావడంతో తిరగలేరు. నేనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికైనా ఆన్‌లైన్‌లో భూమిని నమోదు చేయాలి.

బొద్దులూరి సత్యనారాయణ, తక్కెళ్లపాడు


సదరం శిబిరానికెళ్తే వైకల్యం లేదన్నారు

తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఏడేళ్ల నుంచి పక్షవాతంతో కాళ్లు, చేతులు కదిలించడం లేదు. అన్నపానీయాలన్నీ మంచంలోనే. భార్య రమణ ఆయన్ను కనిపెట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. పొన్నూరులో వైద్యుల వద్దకు తీసుకెళ్తే అంతా బాగానే ఉందని చెప్పి, సదరం ధ్రువపత్రంలో వైకల్యం శాతం ‘0’ అని నమోదు చేశారు. ఇళ్ల వద్ద పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారామె. అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని కోరుతున్నారు. పక్షవాతంతో మంచం పట్టిన శ్రీనవాసరావును కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌కు తీసుకొచ్చి అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు.


పది నెలలుగా పింఛను ఆపేశారు: అప్పారావు, రాజీవ్‌గాంధీనగర్‌

కాలికి పోలియో సోకింది. ఎన్టీఆర్‌ పింఛను ప్రారంభించిన సమయంలో రూ.75 ఇచ్చేవారు. వాలంటీరు వచ్చి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని, మీ పేరుతో చాలా ఆస్తులున్నాయని చెప్పి పింఛను ఆపేశారు. కొడుకు వద్దే ఉంటున్న నాకు కనీసం మందులు, చిన్నపాటి అవసరాలకు పింఛను ఎంతో ఉపయోగపడుతుంది. పది నెలలుగా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నా. అధికారులు స్పందించి పునరుద్ధరించాలి.


తక్కువకు పాడుకున్నవారికి కట్టబెట్టేందుకు యత్నం

దేవాదాయ శాఖకు చెందిన పొలాలను కౌలు బహిరంగ వేలంపాటను నిబంధనల ప్రకారం నిర్వహించాలని తక్కెళ్లపాడు, ఉప్పలపాడుకు చెందిన రైతులు అమ్మిశెట్టి దేవేంద్రరావు, అమ్మిశెట్టి శివకోటేశ్వరరావు, అమ్మిశెట్టి మల్లికార్జునరావు పి.శంకరరావు తదితరులు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందించారు. పాతగుంటూరు అగస్తేశ్వర ఆలయం పరిధిలో ఉప్పలపాడులో 6.70 ఎకరాల భూమికి గత నెల 28న బహిరంగ వేలంపాట నిర్వహించగా తక్కువకు పాడిన వారికి కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. పెదకాకాని ఆలయ భూములకు వేలంపాట సరిగా నిర్వహించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని