logo

బాధిత బాలికలపైనే అక్రమ కేసు

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 02 Jul 2024 04:09 IST

కొరిశపాడు ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు

బాపట్ల, బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో తమ్మిశెట్టి నాగదేవి, రాజేంద్ర తమపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషిస్తే బాధితులమైన తమపై కొరిశపాడు ఎస్సై అక్రమంగా కేసు కట్టారని అక్కాచెల్లెళ్లయిన బాలికలు ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ తాతతో పాటు వచ్చిన బాలికలు ఎస్పీని కలిశారు. వారు మాట్లాడుతూ గత నెల 19న తమ ఇంటి ముందుగా నాగదేవి నడిచి వెళ్తుండగా తమ కుక్క పిల్ల అరిచిందన్నారు. దీనిపై గొడవకు వచ్చి తమపై భార్యాభర్తలు దాడి చేసి అసభ్యంగా దూషించారన్నారు. ఈ విషయమై కొరిశపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేయటానికి తాము వెళ్లగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులు చెప్పారన్నారు. అద్దంకి ఆసుపత్రిలో చేరి దాడి ఘటనపై ఫిర్యాదు చేశామని తెలిపారు. మా పైనే పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా అంటూ నాగదేవి, రాజేంద్ర మరోసారి వచ్చి దూషణలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారని బాలికలు ఆరోపించారు. జరిగిన ఘటనపై గ్రామ పెద్దలకు తెలిపామన్నారు. గత నెల 23న కొరిశపాడు పీఎస్‌లో మైనర్లు అయిన తమపై అక్రమంగా ఎస్సై కేసులు నమోదు చేశారని వాపోయారు. కేసులో తమ తాతను నిందితుడిగా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎస్సైను ప్రశ్నించగా రెండు ఫిర్యాదులపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జామీను తీసుకోండని విసురుగా సమాధానం చెప్పారన్నారు. తమ తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నా మా అమ్మ పనులు చేస్తూ మమ్మల్ని చదివిస్తోందని పదోతరగతి పరీక్షల్లోనూ 550కి పైగా మార్కులు తెచ్చుకున్నామని, కావాలనే కక్షపూరితంగా తమపై కేసులు నమోదు చేశారని, కేసులను ఎత్తి వేయటంతోపాటు నాగదేవి కుటుంబ సభ్యుల బెదిరింపుల నుంచి తమను కాపాడాలని బాలికలు వినతిపత్రంలో ఎస్పీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని