logo

రెప్పపాటులో మృత్యు కాటు

కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు.

Updated : 02 Jul 2024 04:07 IST

స్టీరింగ్‌ పట్టేసి కారు పల్టీ
కంతేరు సర్పంచి మృతి

మహేష్‌  (పాత చిత్రం)

తాడికొండ, మంగళగిరి, న్యూస్‌టుడే: కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇంతలో రెప్పపాటులో ముంచుకొచ్చిన ప్రమాదం ఆ కుటుంబలో తీరని వేదన మిగిల్చింది. కళ్లెదుటే భర్త విగతజీవిగా మారడం చూసిన ఆమె ప్రపంచం తల్లకిందులైంది. అభం శుభం తెలియని ఆ చిన్నారి గాయాలపాలైంది. వివరాల్లోకెళితే.. తాడికొండ మండలం కంతేరు గ్రామం సర్పంచి బెజ్జం మహేష్‌ (34)కు విజయవాడకు చెందిన ఆశాజ్యోతితో ఏడేళ్ల కింద వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా.. చిన్నారి విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ప్రతి వారం కంతేరులోని భర్త వద్దకు కుమార్తెతో వచ్చి వెళ్తుంటారు. ఎప్పటిలాగానే సోమవారం భార్య, కుమార్తెతో కలిసి కారులో విజయవాడలోని అత్తింటికి బయలుదేరారు. మంగళగిరిలోని ఫ్లైఓవర్‌ వద్దకు వచ్చేసరికి సాంకేతిక సమస్య తలెత్తి స్టీరింగ్‌ పట్టేయడంతో వాహనం అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టింది. కారు నడుపుతున్న మహేష్‌ డోర్‌ నుంచి బయట పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు స్వల్ప గాయాలు కాగా, చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త మృత దేహం వద్ద భార్య విలపించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మంగళగిరి ఏయిమ్స్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి గ్రామీణ ఎస్సై క్రాంతికిరణ్‌ తెలిపారు.

ప్రమాదానికి గురైన కారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని